మున్సిపల్లో ఎన్నికల్లో కూడా వాలంటీర్ల వినియోగం వుండదన్నారు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ఓటర్ల అనుమానాలు నివృత్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

మద్యం, డబ్బు పంపిణీ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నిమ్మగడ్డ వెల్లడించారు. మున్సిపల్ పోరులో మొబైల్ స్క్వాడ్స్ చురుకుగా పనిచేస్తాయని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే వారిపై ప్రత్యేక నిఘా వుంటుందని ఆయన తెలిపారు.

సున్నిత, అతి సున్నిత కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ రేషన్ వాహనాలు దుర్వినియోగం చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హెచ్చరించారు. 

Also Read:ఏపీ మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్: పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. అప్పుడే స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగా ఆయన జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా శనివారం తిరుపతిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల అధికారులతోనూ నిమ్మగడ్డ సమావేశమయ్యారు.

రేపు విజయవాడ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి.. ఎల్లుండి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అధికారులతో నిమ్మగడ్డ భేటీకానున్నారు.

పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా చూడాలని.. అలాగే పంచాయతీ ఎన్నికల తరహాలోనే విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సారి కూడా వెబ్‌క్యాస్టింగ్‌, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు.