అమరావతి: ఏ గుడికి, మసీదు, చర్చికి లేని డిక్లరేషన్  తిరుమలలోనే ఎందుకని ఏపీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. తిరుమల ఆలయంలోకి వెళ్లడానికి డిక్లరేషన్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆదివారం నాడు ఏపీ మంత్రి కొడాలి నాని ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లాడు. ఆ సమయంలో డిక్లరేషన్ గురించి చంద్రబాబునాయుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీలు తెచ్చిన విధానమని ఆయన అభిప్రాయపడ్డారు.

సీఎంకు డిక్లరేషన్ అవసరం లేదన్నారు. ఎక్కడా లేని సంప్రదాయం తిరుమలలోనే ఎందుకని ఆయన ప్రశ్నించారు. సంతకం పెట్టకుండా శ్రీవారి గుడికి వెళ్తే తిరుమల అపవిత్రం అవుతోందా అని ఆయన ప్రశ్నించారు.

దేవాలయాల్లో వరుస ఘటనలపై టీడీపీ నేతలపై అనుమానాలున్నాయని ఆయన చెప్పారు. కనకదుర్గ గుడిలో 10 కిలోల వెండి బొమ్మలు ఎత్తుకుపోతే...కోటి రూపాయాల రథం పోతే దేవుడికి పోయేదేమీ లేదన్నారు.

హిందూవులకు తాము చాంపియన్లమని టీడీపీ, బీజేపీ, జనసేనలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.