Asianet News TeluguAsianet News Telugu

ఎపీలో పంచాయితీ ఎన్నికల కోలాహలం... ఇవాళ్టి నుండే నామినేషన్లు

విజయనగరం జిల్లా మినహా మిగతా జిల్లాల్లో మొదటివిడత ఎన్నికలకు ఇవాల్టినుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలవనుంది. 

AP Panchayat Elections... Nomination process begins
Author
Amaravathi, First Published Jan 29, 2021, 9:56 AM IST

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఇవాల్టి(శుక్రవారం)నుంచి పంచాయితీ ఎన్నికల కోలాహలం ప్రారంభంకానుంది.  12 జిల్లాల్లోని 18 రెవిన్యూ డివిజన్లలో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. విజయనగరం జిల్లా మినహా మిగతా జిల్లాల్లో మొదటివిడత ఎన్నికలకు ఇవాల్టినుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలవనుంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకూ నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈ నెల 31 వరకూ ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 

ఇక ఈ నామినేషన్ల గడువు పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 4 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు కల్పించారు. ఇక ఫిబ్రవరి 9న ఆయా పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 4 గంటలనుంచి కౌంటింగ్ జరిపి ఫలితాన్ని వెల్లడించనున్నారు. దీంతో మొదటి విడత పంచాయితీ ఎన్నికలు పూర్తవుతాయి. ఆ వెంటనే రెండో విడత కోలాహలం మొదలవుతుంది. 

read more  నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద వ్యాఖ్యలు: సజ్జలపై రఘురామ కృష్ణంరాజు ఫైర్

అయితే పంచాయితీ ఎన్నికలలో స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లా కలెక్టర్ల వినతి మేరకు ఎన్నికలు జరగాల్సిన పంచాయితీలలో మార్పులు చేసినట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు డివిజన్ లో 20 మండలాలకు గాను 15కు మాత్రమే తొలిదశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. మిగిలిన ఐదు మండలాలకు రెండవ దఫాలో ఎన్నికలు జరగనున్నాయి.  పంగులూరు, కోరిశపాడు, ఎస్.మాగులూరు, అద్దంకి, బల్లికురవ మండలాలలో పంచాయితీలకి ఫిబ్రవరి 9కి బదులు 13వ తేదీన రెండవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం మండలానికి 3వ దఫాకు బదులుగా 2వ దఫాలోనే ఎన్నికలు నిర్వహించనుండగా.. ఏలూరు డివిజనులోని నాలుగు మండలాలకు నాల్గవ దఫా బదులుగా మూడవ దఫాలోనే ఎన్నికలు జరపనున్నారు.చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం,టి.నర్సాపురం మండలాలలోని పంచాయితీలకి ఫిబ్రవరి 21 బదులుగా ఫిబ్రవరి 17న మూడవ విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో మిగిలిన మండలాలకు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం నాల్గవ దఫాలో ఎన్నికలు జరపనున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios