హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న బొత్స సత్యనారాయణ విచారణ నిమిత్తం మంగళవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.  

జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కోసం వశిష్టవాహన్ అనే సంస్థకు 11 కోట్ల రూపాయలు చెల్లించిన కుంభకోణంలో బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ నలుగురిపై అభియోగాలు మోపింది. జైన్, అళగ రాజా, గాయత్రి, వశిష్టవాహన్ సీఈవో సూష్టర్‌లపై కేసులు నమోదు చేసింది.
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రి బొత్స సత్యనారాయణ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యహారం చోటు చేసుకుంది. విశాఖపట్నంలో కార్ల ఫ్యాక్టరీ స్థాపనకు వోక్స్ వ్యాగన్‌కు మధ్యవర్తిగా వ్యవహరించిన వశిష్ట వాహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు చెల్లించింది. 

అయితే వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్‌తో తమకు ఏ విధమైన సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ ప్రకటించడంతో బొత్స సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో నాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. 

2005లో వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీబీఐ 3 వేల పేజీలతో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 59 మంది సాక్షులను విచారించగా 62వ సాక్షి అయిన బొత్సను మంగళవారం విచారించింది. 

ఇకపోతే ఈ వోక్స్ వ్యాగన్ కేసులు మెుత్తం 12 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు సీబీఐ స్పష్టం చేయగా ఇప్పటి వరకు రూ.7కోట్లు రికవరీ చేసింది. మిగిలిన 5 కోట్ల రూపాయల రికవరీ కోసం విచారణ జరుగుతోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

మోదీ, షాలను ధిక్కరిస్తారా..? మీపై వోక్స్ వ్యాగన్ కేసు ఉంది: బొత్సకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

సీబీఐ సమన్లపై మంత్రి బొత్స సత్యనారాయణ రియాక్షన్ ఇదీ.....

మంత్రి బొత్సకు షాక్: సీబీఐ కోర్టు సమన్లు