అమరావతి: వోక్స్ వ్యాగన్ కేసులో సీబీఐ సమన్లపై ఏపీ మంత్రి బొత్ససత్యనారాయణ స్పందించారు. వోక్స్ వ్యాగన్ కేసులో తాను సాక్షిని మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఆ కేసులో తాను 60వ సాక్షిగా మాత్రమే సీబీఐ పిలిచిందని స్పష్టం చేశారు. విచారణకు హాజరవుతానని తెలిపారు. 

ఇకపోతే మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.వోక్స్ వ్యాగన్ కేసులో నోటీసులు పంపారు. సెప్టెంబర్ 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

2005లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది వోక్స్ వ్యాగన్ కేసు. వోక్స్ వ్యాగన్ కేసులో అవినీతి చోటు చేసుకొందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకు అప్పగించింది. 

ఇకపోతే ఈ వోక్స్ వ్యాగన్ కేసు తెరపైకి వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. వోక్స్ వ్యాగన్ కేసులో సుమారు రూ. 12 కోట్ల రూపాయాల అవినీతి చోటు చేసుకొందని సీబీఐ గుర్తించగా ఇప్పటికే సుమారు రూ. 7 కోట్లను రికవరీ చేశారు. మరో రూ. ఐదు కోట్లను రికవరీ చేయాల్సి ఉంది.

కేసు విచారణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ విచారణను ముమ్మురం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే 3వేల పేజీల చార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది. 59 సాక్షులను విచారించింది. 60వ సాక్షిగా ఉన్న ఆనాటి మంత్రి నేటి మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు అందజేసింది. 

ఈ వార్తలు కూడా చదవండి

మంత్రి బొత్సకు షాక్: సీబీఐ కోర్టు సమన్లు