అమరావతి: ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మంత్రి బొత్స సత్యనారాయణ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. బొత్స సత్యనారాయణపై గతంలో వోక్స్ వ్యాగన్ కేసు మళ్లీ తెరపైకి వస్తుందేమో చూసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. 

అమరావతిపై బొత్స సత్యనారాయణ సంయమనంతో మాట్లాడాలని సూచించారు. ఆచితూచి మాట్లాడటం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరిపోతుందనుకుంటే సీన్ రివర్స్ అయితే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. 

రాజధాని అమరావతిపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు. రాజధాని రైతుల కంట కన్నీరు పెట్టొద్దని సూచించారు. గత ప్రభుత్వం కూడా రైతుల కన్నింటినీరు వచ్చేలా ప్రవర్తించారని ఫలితం అనుభవించారని చెప్పుకొచ్చారు. ప్రజల కంట కన్నీరు పెట్టిస్తే ఈ ప్రభుత్వం కూడా మనుగడ సాధించదన్నారు. 

రాజధానిని అమరావతి నుంచి విజయనగరం తరలించుకుపోదామని ఉందా అంటూ విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చి రాజధానిని శంకుస్థాపన చేశారన్న విషయం గుర్తుందా అంటూ నిలదీశారు. ఇకనైనా బొత్స సత్యనారాయణ మా మాట వినకపోతే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు.

బొత్స సత్యనారాయణ రాజకీయంలో చాలా సీనియర్ అని ఆయన అనుభవం ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని కోరారు. బొత్స సత్యనారాయణ పెద్దరికం నిలబెట్టుకోవాలని హితవు పలికారు పవన్. ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవాలంటూ హితవు పలికారు. 

బొత్స సత్యనారాయణ అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తే ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను వ్యతిరేకిస్తున్నారా అంటూ నిలదీశారు. రాజధాని తరలిస్తామంటే వారిని ధిక్కరించినట్లేనని హెచ్చరించారు.  బొత్స గారూ జాగ్రత్త అంటూ చివర పంచ్ వేశారు పవన్ కళ్యాణ్.     

ఈ వార్తలు కూడా చదవండి

దేన్ని కూలుద్దామా అన్నదే జగన్ ఆలోచన, ప్రజలతో ఆటలు మంచిది కాదు: పవన్ కళ్యాణ్