అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఇంట్లో కోట్లాది రూపాయల డబ్బులు ఉన్నాయని ఆరోపించారు. 

జగన్ ఇంట్లోని బంకర్లలో ఉన్న డబ్బులు బయటకు వస్తే ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టవచ్చునని చెప్పుకొచ్చారు. జగన్ అవినీతి సొమ్ము అంతా ఆ బంకర్లలోనే ఉందని చెప్పుకొచ్చారు. జగన్ సీఎం కుర్చీ కోసం తప్ప ప్రజల గురించి మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. 

పసుపు-కుంకుమ పథకం, పింఛన్ పెంపు వంటి పథకాలను జగన్ జీర్ణించుకోలేకపోతున్నాడని విరుచుకుపడ్డారు. పేదలకు డబ్బులు ఇస్తే జగన్ ఓర్వలేకపోతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్వహించిన సభ ఫెయిల్‌ అయిందన్నారు. 

చంద్రబాబుపై షా వ్యాఖ్యలు సరికాదన్నారు. కుటుంబం ఉన్నవాళ్లకంటే కుటుంబం లేని వాళ్లతో చాలా డేంజర్ అని చెప్పుకొచ్చారు. కుటుంబం లేని మోదీ చేతుల్లో దేశం నలిగిపోతోందని ఆయన ఘాటుగా విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్గించేలా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

అందుకు పశ్చిమబెంగాల్‌ ఘటనే నిదర్శనమన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అన్నారు. కేంద్ర-రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి బీజేపీ దిగజారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే కేంద్ర ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని మంత్రి యనమల ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ తిరిగి బీజేపీ చెంతకు చేరే అవకాశమే లేదని యనమల ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలయ్యాక బీజేపీ ఎక్కడుంటుందో తెలియదని జోస్యం చెప్పారు. విభజన హామీలపై కేంద్ర బడ్జెట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని యనమల ప్రశ్నించారు. 

 ఈ వార్తలు కూడా చదవండి

కపట ప్రేమ వద్దు షాజీ, గుణపాఠం చెప్తాం: షాపై లోకేష్ ట్వీట్ల దాడి

తేల్చుకుందామా...!దమ్ముంటే చర్చకు రండి : అమిత్ షా కు టీడీపీ కౌంటర్

సీఎం పదవి కోసం మోదీ కాళ్లు పట్టుకుని ఇప్పుడు నిందలా: చంద్రబాబుపై అమిత్ షా ఫైర్

బీజేపీ బస్సుయాత్రలో రభస: టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్