Asianet News TeluguAsianet News Telugu

సీఎం పదవి కోసం మోదీ కాళ్లు పట్టుకుని ఇప్పుడు నిందలా: చంద్రబాబుపై అమిత్ షా ఫైర్


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు యూటర్న్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఎన్నో యూటర్న్ లు తీసుకున్నారో ఆయనకే తెలియదన్నారు. 

bjp national president amit shah comments on chandrababu
Author
Srikakulam, First Published Feb 4, 2019, 5:32 PM IST

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిమిత్తం బీజేపీ సత్యమేవ జయతే ప్రజా చైతన్య యాత్ర పేరుతో బస్సుయాత్రకు శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు ఈ బస్ యాత్ర కొనసాగనుంది. 

ఈ బస్సుయాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించనున్నారు. అందులో భాగంగా పలాసలోని రైల్వే క్వార్టర్స్ వద్ద అమిత్ షా బస్సయాత్రను ప్రారంభించేందుకు చేరుకున్నారు. అమిత్ షా రాకను వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసనకు దిగింది. 

ఎన్టీఆర్ విగ్రహం వద్ద అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేసింది. దీంతో ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర్ శివాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషతోపాటు పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం అమిత్ షా బస్సుయాత్రను ప్రారంభించారు.  

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు యూటర్న్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఎన్నో యూటర్న్ లు తీసుకున్నారో ఆయనకే తెలియదన్నారు. 

తెలుగు ప్రజల కోసం దివంగత సీఎం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు వంచన చేశారని విరుచుకుపడ్డారు.  మోసపూరిత రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడుకి తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు బీజేపీతో కలిసి రావాలని కోరారు. 

ఏపీలో బీజేపీ బలోపేతానికి ప్రజలు సహకరించాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆ నిందనల నుంచి తప్పించుకునేందుకు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీపై సీఎం చంద్రబాబు నాయుడు అనవసర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఎన్డీఏలో బీజేపీతో పొత్తు వద్దు అనుకున్నాక చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిశారన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు చంద్రబాబు ప్రధాని మోదీ కాళ్లావేళ్లా పట్టుకుని బతిమిలాడారని అలాంటి వ్యక్తి ఆయన్ని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీకి  ద్వారాలు మూసుకుపోయాయని స్పష్టం చేశారు. 

మరోవైపు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వారసత్వ పార్టీలు అని చెప్పుకొచ్చారు. బీజేపీ జాతీయ పార్టీ అని ప్రజల పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ అవినీతిమయమైన పార్టీలంటూ అమిత్ షా ధ్వజమెత్తారు.  

మరోవైపు విభజన చట్టంలోని ఇచ్చిన 14 హామీల్లో 10 హామీలను ఇప్పటికే నెరవేర్చినట్లు తెలిపారు. విభజన హామీలకు పదేళ్లు సమయం ఉన్నా ఐదేళ్లలోనే పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. చట్టంలో లేని అనేక సంస్థలను ఏపీకి ఇచ్చినట్లు తెలిపారు. 

విశాఖపట్నంలో ఐఐఎంను స్థాపించామని, అలాగే తిరుపతిలో ఐఐఎస్ఈఆర్ ప్రవేశపెట్టినట్లు షా తెలిపారు. ఏపీ అభివృద్ధికి నిరంతరం పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క బీజేపీయేనని చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రధాని నరేంద్రమోదీ ఏం చేశారో తెలియజేసేందుకే తాను వచ్చానని అయితే అడ్డుకుంటారా అంటూ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios