తన ప్రధాన అనుచరుడు మోకా భాస్కర్‌రావు హత్యపై వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇదో రాజకీయ హత్యని.. తమను రాజకీయంగా ఎదుర్కోలేకే కిరాయి మనుషులతో చంపించారని వ్యాఖ్యానించారు.

భాస్కర్‌రావు హత్యకు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించారని భావిస్తున్నామని నాని తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని.. తనతో, జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారని మంత్రి చెప్పారు.

మరోవైపు భాస్కర్‌రావు హత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు.

అంతకుముందు మోకా భాస్కర్‌రావు మృతదేహాన్ని నాని పరామర్శించి నివాళులర్పించారు. అనుచరుడి మృతదేహాన్ని చూసి నాని భావోద్వేగానికి లోనై, కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు.

Also Read:ముఖ్య అనుచరుడి దారుణ హత్య... మృతదేహం వద్ద బోరున విలపించిన మంత్రి నాని (వీడియో)

కాగా మచిలీపట్నం చేపల మార్కెట్‌లో భాస్కర్‌రావును దుండగులు కత్తితో దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.

దుండగులు పక్కా స్కెచ్‌తో సైనేడ్ పూసిన కత్తితో భాస్కర్‌రావును హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

మరోవైపు భాస్కర్‌రావు హత్యతో మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ శ్రేణులు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్  చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.