మచిలీపట్నం: రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసిపి నాయకులు మోకా భాస్కరరావు సోమవారం ఉదయం ప్రత్యర్థుల చేతుల్లో దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఈ దారుణం గురించి తెలుసుకున్న మంత్రి నాని హుటాహుటిన మచిలీపట్నంకు చేరుకున్నారు. అయితే అప్పటికే అతడు మృతిచెందడంతో హాస్పిటల్ లో వున్న భౌతికకాయాన్ని సందర్శించి కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి కుటుంబసభ్యులను ఓదారుస్తూ ఆయన ఆయన కూడా బాగా ఎమోషన్ అయ్యారు. 

మంత్రి పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన తొలి నుండి ఆయనతోనే వుంటూ ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నారు భాస్కరరావు. అటువంటి అత్యంత సన్నిహితుడి దారుణ హత్య విషయం తెలుసుకుని మంత్రి చలించిపోయారు. తన హోదాను సైతం మరిచిపోయి బాగా ఎమోషన్ అయ్యారు. కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు ఈ హత్య ఎలా జరిగిందో మంత్రికి వివరించారు. 

వీడియో

"

మచిలీపట్నంలోనే భాస్కర రావుపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. ఇలా రక్తపు మడుగులో పడిపోయిన ఆయనను వెంటనే  ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గుండెపై బలమైన గాయం కావడంతో ఆయన మృత్యువాత పడ్డట్లు డాక్టర్లు తెలిపారు. 

read more  నిండు గర్భిణీ మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి...

భాస్కర రావు హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా టీడీపీ నేత చిన్నిని పోలీసులు అనుమానిస్తున్నారు. భాస్కర రావుపై దాడి ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సీసీటీవి కెమెరా దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భాస్కర రావుపై దాడి జరిగిన తర్వాత చిన్ని ఇంటికి తాళం వేసి పరారైనట్లు భావిస్తున్నారు. 

పాతకక్షలే దాడికి కారణమని పోలీసులు చెబుతున్నారు. 2013లో జరిగిన సురేంద్ర హత్య కేసులో భాస్కర రావు నిందితుడని తెలుస్తోంది. ఆ కారణంగానే భాస్కర రావు హత్యకు గురయ్యాడని అంటున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.