అమరావతి:  ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని   హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఆదివారం నాడు విచారణ సాగింది.ఈ నెల 21వ తేదీ వరకు మీడియాతో మాట్లాడవద్దని మంత్రి నానిని ఎస్ఈసీ ఆదేశించింది.ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

Aslo read:కొడాలి నానిపై కేసుకి ఎస్ఈసీ ఆదేశాలు: న్యాయ సలహాకి పంపిన కృష్ణా జిల్లా పోలీసులు


ఎస్ఈసీ, కమిషనర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని  కొడాలి నాని  తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలతో ఎస్ఈసీ తరపు న్యాయవాది ఏకీభవించలేదు.కొడాలి వ్యాఖ్యలు వేరేవారి వ్యాఖ్యలతో పోల్చి చూడలేమని ఎస్ఈసీ తరపు  లాయర్ కోర్టుకు చెప్పారు. వీడియో పుటేజీని పరిశీలించాలని ఈ సందర్భంగా ఎస్ఈసీ తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్ధించారు.

ఈ అభ్యర్ధనను హైకోర్టు మన్నించింది. మంత్రి నాని చేసిన వ్యాఖ్యల వీడియో పుటేజీని పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. ఆ తర్వాతే విచారణపై నిర్ణయం తీసుకొంటామని ప్రకటించింది.ఈ నెల 15వ తేదీన వీడియో పుటేజీని పరిశీలిస్తామని  హైకోర్టు  తెలిపింది. వీడియో పుటేజీ ఫైల్ చేశారా అని హైకోర్టు రిజిస్ట్రీని కోర్టు ప్రశ్నించింది. వీడియో పుటేజీ ఫైల్ చేసినట్టుగా రిజిస్ట్రీ కోర్టుకు తెలిపారు. 

దీంతో సోమవారం నాడు మధ్యాహ్నం ఈ వీడియో పుటేజీని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకొంటామని హైకోర్టు ప్రకటించింది.