అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలను ఆయన అడ్డుకునేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటనను బట్టి చూస్తే అది స్పష్టమవుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమని గౌతమ్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రమేష్ కుమార్ గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని చెప్పారు. రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత తదుపరి కార్యాచరణపై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు.

Also Read: స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం: మంత్రి మేకపాటి

రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా వైఎస్ జగన్ చూసుకుంటున్నట్లు అర్థమవుతోంది. వైఎస్ జగన్ కు తెలియకుండా గౌతమ్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగవని చెప్పే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాత్రం ఎన్నికల నిర్వహణకు పట్టుబట్టే అవకాశం ఉంది. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా గతంలో రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికలను వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. ఎస్ఈసీగా రమేష్ కుమార్ ను తప్పించేందుకు జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ లు కూడా జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలతో ఆయన తిరిగి ఎస్ఈసీగా నియమితులయ్యారు. 

వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రమేష్ కుమార్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపిస్తూ ఆయన హైకోర్టును కూడా ఆదేశించారు. ఎస్ఈసీకి సహకరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

గతంలో పలు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అధికార వైసీపీ నేతలు ప్రత్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి, తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని రమేష్ కుమార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.