Asianet News TeluguAsianet News Telugu

స్వగ్రామం నుంచే విధులు...18 ఏళ్లకే ఉద్యోగం: ఐటీ మంత్రి మేకపాటీ

ఐటీ వృద్ధికి హెచ్‌సీఎల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ముందుకు రావాలని మంత్రి ఈ సంస్థ సీఈవోకు ఆహ్వానం పలికారు.

AP IT Minister Meeting With  HCL CEO Roshini Nadar
Author
Amaravathi, First Published Oct 8, 2020, 2:40 PM IST

అమరావతి: స్వగ్రామం నుంచే సాఫ్ట్ వేర్ విధులు నిర్వర్తించే వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టనున్నట్లు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. స్టార్ట్ అప్ లకు ఏపీ చిరునామాగా మారనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం ప్రఖ్యాత ఐ.టీ కంపెనీ 'హెచ్‌సీఎల్ టెక్నాలజీస్' సీఈవో రోషిణీ నాడార్ మల్హోత్రాతో మంత్రి మేకపాటి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రకారం విశాఖపట్నంలో అత్యున్నత స్థాయి నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఐటీ హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో తాజాగా ఓ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని సందర్శించినపుడు అక్కడ ఓ బాలిక ప్రతిభ, వర్కింగ్ స్కిల్ తనను ఎంతగానో ఆకట్టుకున్న విషయాన్ని మంత్రి మేకపాటి ప్రస్తావించారు.

ఐటీ వృద్ధికి హెచ్‌సీఎల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ముందుకు రావాలని మంత్రి ఈ సంస్థ సీఈవోకు ఆహ్వానం పలికారు. రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్ గా మార్చడంలో, టాలెంట్ పూల్ ను నెలకొల్పడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తరహా అత్యాధునిక కోర్సులకు చిరునామాగా ఏర్పాటు  చేయనున్న స్కిల్ యూనివర్శిటీలో తోడ్పాటునందించాలని మంత్రి కోరడంతో రోషిణీ సానుకూలంగా స్పందించడంతో పాటు ఆసక్తి చూపారు.

read more   ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఏపీ విద్యార్ధులు చేరుకోవాలి: విద్యాకానుక పథకం ప్రారంభించిన జగన్

ఇతర రాష్ట్రాలలో స్టార్టప్ ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అంకురాల ఏర్పాటుకు అనుకూలమని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో చాలా తక్కువ ఖర్చుకే  హబ్ ల ఏర్పాటుకు అవసరమైన భూములు, యువత ప్రతిభ పుష్కలంగా ఉందన్నారు. ప్రస్తుతం హెచ్ సీఎల్ సంస్థ చేపడుతున్న 'టెక్ బీ' కార్యక్రమం ద్వారా ఇంటర్ చదివిని యువతకు 18 ఏళ్లు నిండేసరికే ఉద్యోగాలు పొందేలా వివిధ కోర్సులు నేర్పడం, శిక్షణ అందించడం, ప్లేస్ మెంట్ల ద్వారా ఉద్యోగాలివ్వడం వంటి అంశాలను మంత్రి మేకపాటికి సీఈవో వివరించారు. 

పదవతరగతి పూర్తి చేసిన బాలికలకు కూడా ఇదే తరహా కార్యక్రమం ద్వారా స్వశక్తితో నిలిచేలా చేయడానికి యత్నిస్తున్న హెచ్ సీఎల్ ను మంత్రి మేకపాటి అభినందించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ కూడా పాల్గొన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios