అమరావతి: ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఏపీకి చెందిన పేద విద్యార్థులు చేరుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.గురువారం నాడు కృష్ణా జిల్లా పునాదిపాడు స్కూల్ లో జగనన్న విద్యా కానుక పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

ఈ పథకం కింద ప్రతి విద్యార్ధికి మూడు జతల స్కూల్ యూనిఫారాలు, బూట్లు,సాక్సులు, బెల్టులు, పుస్తకాలు, బ్యాగులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు ప్రతి విద్యార్ధికి వీటిని అందిస్తారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 42 లక్షల 34 వేల 322 మంది విద్యార్ధులకు లబ్ది పొందే అవకాశం ఉంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 650 కోట్లను ఖర్చు చేస్తోంది.

తొలుత సీఎం జగన్ ఈ స్కూల్ కు చెందిన విద్యార్థులతో ముచ్చటించారు.  బెంచీలు ఎలా ఉన్నాయని ఆయన విద్యార్ధులను అడిగారు. కాళ్లు పెట్టుకోవడానికి వీలుగా ఉందా అని ఆయన విద్యార్ధులను ప్రశ్నించారు. విద్యార్థులు అబాకస్ ద్వారా లెక్కలు చేసిన విధానాన్ని సీఎం జగన్ చూశారు. 

స్కూల్ లో వసతుల గురించి ఆయన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు మాత్రమే ఉందన్నారు.చదువే విద్యార్థులకు శక్తిని ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యలో సమూల మార్పులు తెస్తేనే ఇది సాధ్యమౌతోందని ఆయన చెప్పారు.స్కూళ్లలో డ్రాపవుట్స్ పై గత ప్రభుత్వం ఆలోచించలేదని ఆయన విమర్శించారు. 

ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఆర్ధికంగా భారంగా మారిన పరిస్థితులున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అంగన్ వాడీ నుండి ఉన్నత విద్యవరకు విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు.

బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహరం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే గోరుముద్ద పథకాన్ని తీసుకొచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. నాడు- నేడు పథకం ద్వారా స్కూల్స్ రూపురేఖలను మారుస్తున్నామని సీఎం వివరించారు.

పేద విద్యార్థులు పెద్దవాళ్లతో పోటీపడేందుకే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు.వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన అమ్మఒడి పథకం డబ్బులను ప్రభుత్వం అందించనుందని సీఎం ప్రకటించారు.