మేడికొండూరు మండలం కొర్రపాడులో ప్రేమ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొన్న బాలిక కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరామర్శించారు.

ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. పదవ తరగతి బాలిక ప్రేమ వేధింపులు తాళలేక చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని చట్టాలు చేసిన ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.

ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పి ఉంటే బాగుండేదని సుచరిత అభిప్రాయపడ్డారు. దిశ బృందం కేసు దర్యాప్తు చేస్తోందని.. త్వరతిగతిన న్యాయం జరగాలని దిశ తీసుకొచ్చామని హోంమంత్రి గుర్తుచేశారు.

Also Read:మేడికొండూరు ఘటన: నిందితుడు అరెస్ట్, రేపు కోర్టు ముందుకు

ఇప్పటి వరకు ముగ్గురికి ఉరిశిక్ష, ఇరవై మందికి జీవిత ఖైదు విధించారని సుచరిత తెలిపారు. వెంటనే శిక్ష పడితే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తున్నామని... వేధింపులు గురించి తల్లిదండ్రులకు చెప్పాలని ఆమె విద్యార్ధినులకు విజ్ఞప్తి చేశారు.

అలా చేస్తే వెంటనే నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. దిశను బలోపేతం చేస్తూ పోలీసు శాఖకు వెహికల్స్ ఇస్తే దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆమె ప్రతిపక్షాలకు చురకలంటించారు.

పార్టీ గుర్తులంటూ మాట్లాడుతున్నారని.. గతంలో స్మశానాలు నుండి వాటర్ ట్యాంక్‌ల వరకూ పసుపు రంగు పులిమారని సుచరిత ఆరోపించారు. దిశ చట్టం కనిపించేలా స్టిక్కరింగ్ చేస్తే తప్పుపడుతున్నారని... మహిళల భద్రతపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హోం మంత్రి స్పష్టం  చేశారు. ఇతర రాష్ట్రాలు సైతం దిశ చట్టం గురించి ఆలోచిస్తున్నాయని ఆమె చెప్పారు.