గుంటూరు జిల్లా మేడికొండూరు బాలిక ఆత్మహత్య ఘటనలో రెండో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వరప్రసాద్ 6 నెలలుగా బాలిక వెంటపడుతున్నాడని దిశ డీఎస్పీ రవికుమార్ తెలిపారు.

బాధితురాలి వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వరప్రసాద్‌ను పేరేచర్ల వద్ద అరెస్ట్ చేశామని.. రేపు నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని రవికుమార్ వెల్లడించారు.

మేడికొండూరు మండలం కొర్రపాడుకు చెందిన విద్యార్థిని సౌమ్యను వరప్రసాద్‌ కొంత కాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. దీంతో సౌమ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

Also Read:గుంటూరులో ప్రేమ పేరుతో వేధింపులు: ఆత్మహత్య చేసుకొన్న విద్యార్ధిని

దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వరప్రసాద్ వల్లే తాను చనిపోతున్నానంటూ ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వీడియో వాంగ్మూలంలో చెప్పి తుదిశ్వాస విడిచింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సౌమ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఏపీ మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.