కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహించినట్లు రుజువయితే కోర్టు ధిక్కరణ కింద చర్యల తీసుకుంటామని విశాఖ జిల్లా కలెక్టర్ ను ఏపీ హైకోర్టు హెచ్చరించింది.
అమరావతి: విశాఖ జిల్లా కలెక్టర్ (visakha collector) పై రాష్ట్ర హైకోర్ట్ (ap high court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ దాఖలయిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం గతంలోనే ఆదేశాలిచ్చినా నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని విశాఖ కలెక్టర్ ను ప్రశ్నించింది. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వడానికి స్వయంగా కలెక్టర్ జనవరి 3వ తేదీన తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. ఒకవేళ తమ ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపడతామని విశాఖ కలెక్టర్ ను హైకోర్టు హెచ్చరించింది.
విశాఖ జిల్లా సబ్బవరం (sabbavaram)లోని 255, 22, 277 సర్వే నంబర్ భూమి ప్రభుత్వానికి చెందినది. అయితే ఈ భూమిపై కన్నేసిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అధికారులతో కుమ్మకయి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగి వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. ఈ పిటిషన్ పై గతేడాది విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరక్కుండా చూడాలని జిల్లా కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది.
అయితే ఈ పిటిషన్ నిన్న (గురువారం) హైకోర్టు ముందుకు మరోసారి విచారణకు వచ్చింది. గతంలో నిర్మాణాలు ఆపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా అమలు కాలేవని పిటిషన్ తరపు న్యాయవాది అక్బర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చాడు. ఆ భూమిలో యదేచ్చగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. నిర్మాణ పనులకు సంబంధించిన ఫోటోలను కోర్టు ముందుంచారు పిటిషనర్ తరపు న్యాయవాది.
read more ఏపీ హైకోర్టులో అశోక్ గజపతి రాజుకు ఊరట.. ఏ విషయంలో అంటే..
దీంతో విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి జిల్లా కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా హాజరయి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
గతంలో కోర్టు ఆదేశాలను అమలుచేయని ఐఎఎస్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌లకు వారం పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం కోర్టు ఆదేశాలను వెంటనే అమలుచేస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఐఏఎస్ అధికారులకు విధించిన శిక్షను రద్దు చేసింది న్యాయస్థానం.
read more కోర్టు విచారణ జరుగుతుండగా అర్ధనగ్న ప్రదర్శన.. కోర్టు ధిక్కరణగా ఫిర్యాదు
ఇక నెల్లూరు జిల్లాలో 2015 నాటి భూసేకరణకు సంబంధించిన కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌కు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్‌కి నెలరోజుల జైలు, రూ.2వేల జరిమానా, అప్పటి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, రూ.1000 జరిమానా, కలెక్టర్లు ఎంవీ శేషగిరిబాబు, ఎన్‌వీ చక్రధర్‌లకు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది.అయితే బాధితులకు ఇప్పటికే పరిహారం అందినట్లు ఐఏఎస్‌లు కోర్టుకు తెలపడంతో ఈ కేసులో తీర్పును సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
