అమరావతి అసైన్డ్ భూముల కేసు: తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
అమరావతి అసైన్డ్ భూముల కేసులో తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. గతంలో ఈ కేసుపై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.
అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కేసులో అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు.అమరావతి అసైన్డ్ భూముల్లో అవకతవకలకు పాల్పడ్డారని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో తుది విచారణ పూర్తైంది. అయితే తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.
అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్లపై చంద్రబాబు, నారాయణలపై నమోదైన సీఐడీ కేసులపై తుది విచారణను ఈ నెల మొదటి వారంలో ప్రారంభించింది ఏపీ హైకోర్టు. ఈ విచారణ సందర్భంగా సీఐడీతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, నారాయణ తరపు న్యాయవాదులు తమ వాదనలు విన్పించారు. అన్ని వర్గాల వాదనలను విన్న తర్వాత తుది తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
అమరావతిలో దళితుల భూములను మాజీ మంత్రి నారాయణ కొనుగోలు చేయించారనే సీఐడీ గతంలోనే ఆరోపణలు చేసింది. హైకోర్టులో విచారణ సమయంలో ఈ విషయమై తన వాదనలను విన్పించింది. మరో వైపు 41 జీవోను చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చి పేదలకు అన్యాయం చేసిందని ఆరోపించింది. ఈ విషయమై బాధితుల స్టేట్ మెంట్ ను సీల్డ్ కవర్లో సీఐడీ అధికారులు హైకోర్టుకు సమర్పించారు.
2021 ఫిబ్రవరిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి అసైన్డ్ భూములపై సీఐడీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా 2021 మార్చిలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసును కొట్టి వేయాలని చంద్రబాబు, నారాయణలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది. చంద్రబాబు, నారాయణలపై నమోదైన కేసుల్లో తదుపరి చర్యలు తీసుకోవద్దని 2021 మార్చి 19 స్టే ఇచ్చింది. ఈ కేసులో తుది విచారణలో భాగంగా అన్ని వర్గాల వాదనలను కూడ హైకోర్టు విన్నది. ఇవాళ వాదనలను వినడం పూర్తైంది.అయితే తీర్పును మాత్రం రిజర్వ్ చేస్తున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది.