విశాఖలోని సీబీఐ కోర్టులు కర్నూల్, విజయవాడకు తరలింపు: ఏపీ హైకోర్టు ఆదేశాలు

విశాఖపట్టణంలో ఉన్న రెండు సీబీఐ కోర్టులను విజయవాడ, కర్నూల్ లకు తరలించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఏపీ హైకోర్ట్ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. 

AP High Court Orders To shifting CBI Courts from Visakhapatnam to Kurnool


విశాఖపట్టణం: సీబీఐ కోర్టులను కర్నూల్, విజయవాడకు తరలించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఏపీ హైకోర్టు తెలిపింది. విశాఖపట్టణంలో ఉన్న సీబీఐ రెండో అదనపు  కోర్టును  కర్నూల్ కు, మూడో అదనపు సీబీఐ కోర్టు విజయవాడకు తరలించనున్నారు.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ప్రభుత్వ జీవో ఆధారంగా ఈ  కోర్టులను తరలించాలని హైకోర్టు ఆదేశించింది.

 రాష్ట్ర విభజనతో హైద్రాబాద్ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాల ప్రాదేశిక అధికార పరిధిలో మార్పులు చేర్పులు చేశారు. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాలను హైద్రాబాద్ సీబీఐ కోర్టు పరిధి నుండి తప్పించారు. దీంతో ఈ జిల్లాలను విశాఖపట్టణం సీబీఐ కోర్టు పరిధిలోకి తీసుకు వచ్చారు. దరిమిలా విశాఖపట్టణం రెండో అదనపు సీబీఐ కోర్టును కర్నూల్ కు తరలించాలని ఏపీ ప్రభుత్వం 2020లో జీవోలు జారీ చేసింది.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో హైద్రాాబాద్, విశాఖపట్టణం, విజయవాడల్లో మాత్రమే సీబీఐ కోర్టులున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్  అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. కర్నూల్ ను న్యాయ రాజధానిగా చేస్తామని జగన్ సర్కార్  ప్రకటించింది.

అమరావతిలోని హైకోర్టును కర్నూల్ కు తరలించాలని  న్యాయవాదులు  ఆందోళనలు నిర్వహిస్తున్నారు.ఈ సమయంలో కర్నూల్ కు సీబీఐ కోర్టును తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిన్న నంద్యాలలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో సీఎం జగన్ ను న్యాయవాదులు కలిశారరు. కర్నూల్ కు హైకోర్టును తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ మేరకు జగన్ కు వినతి పత్రం కూడా సమర్పించారు.  

మరోవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అమరాంతి నుండి అరసవెల్లికి పాదయాత్రను నిర్వహిస్తున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ నిర్వహిస్తున్న ఆందోళనలు వెయ్యి రోజులు పూర్తైనందున ఈ పాదయాత్రను చేపట్టారు. 

అమరావతి రైతుల పాదయాత్రను వైసీపీ తప్పుబట్టింది.ఈ పాదయాత్రను ఉత్తరాంధ్రపై దండయాత్రగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా నాలుగు రోజుల క్రితం విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్ లు పాల్గొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందే అవకాశం ఉందని చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios