వలస కార్మికులకే తొలి ప్రాధాన్యం.. రెండో దశలో మిగిలిన వారికి ఛాన్స్: ఆళ్ల నాని
వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి తరలించే విషయంలో వలస కార్మికులకే మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.
వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి తరలించే విషయంలో వలస కార్మికులకే మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఏపీకి చెందిన 2 లక్షల మంది కార్మికులు 14 రాష్ట్రాల్లో ఉన్నారని.. ఇతర రాష్ట్రాలకు చెందిన 12,794 మంది మన రాష్ట్రంలో ఉన్నారని ఆయన అన్నారు.
బెజవాడలో ఆదివారం రాష్ట్ర కోవిడ్ 19 టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆళ్లనాని మాట్లాడారు. రెండో దశలో విద్యార్ధులు, యాత్రికులు, పర్యాటకులను తరలిస్తామని మంత్రి తెలిపారు.
Also Read:గుంటూరు రెడ్‌జోన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐకి కరోనా: కుటుంబ సభ్యులు క్వారంటైన్ కి
వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన కూలీలను 9 రైళ్ల ద్వారా ఏపీకి తీసుకొస్తామని చెప్పారు. గ్రామ సచివాలయంలో ఒకటి చొప్పున లక్ష పడకలతో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆళ్ల నాని వెల్లడించారు.
ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చే లోపు క్వారంటైన్ సెంటర్లను సిద్ధం చేస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న చోట 500 బస్సుల ద్వారా నిత్యావసరాలను విక్రయిస్తామని.. కేసులు ఎక్కువగా ఉన్న చోట్ల ఇంటికి ఒకరికి చొప్పున పాస్ ఇస్తామని ఆళ్ల నాని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రయాణాల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Also Read:మళ్లీ అదే సమస్య: తెలంగాణ పాస్‌లు చెల్లవు.. ఎక్కడి వారు అక్కడే వుండాలన్న ఏపీ
సరిహద్దుల వద్దకు వచ్చి ఎవరూ ఇబ్బందులు పడొద్దని కోరింది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం కేవలం వలస కూలీలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వేల సంఖ్యలో ఉన్న వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్‌లో పెట్టి సదుపాయాలు కల్పిస్తున్నామని.. అందువల్ల మిగిలినవారు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా దృష్ట్యా ఎక్కడి వారు అక్కడే ఉండటం క్షేమకరమని, కోవిడ్ 19పై చేస్తున్న పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయమని ఏపీ సర్కార్ అభినందించింది.