Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ అదే సమస్య: తెలంగాణ పాస్‌లు చెల్లవు.. ఎక్కడి వారు అక్కడే వుండాలన్న ఏపీ

 ఏపీలోని తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి పత్రాలు జారీ చేసినా ఆంధ్రప్రదేశ్ అధికారులు మాత్రం ఆ రాష్ట్రంలోకి వెళ్లేందుకు వారిని అనుమతించడం లేదు

AP officials Objected to Migrated Labour from telangana
Author
Vijayawada, First Published May 3, 2020, 4:34 PM IST

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో ఎక్కడి వారు అక్కడ చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులు వారి స్వ రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఏపీలోని తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి పత్రాలు జారీ చేసినా ఆంధ్రప్రదేశ్ అధికారులు మాత్రం ఆ రాష్ట్రంలోకి వెళ్లేందుకు వారిని అనుమతించడం లేదు.

Also Read:స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ పాసుల జారీ: తెలంగాణ డీజీపీ

ఖమ్మం, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లోని క్వారంటైన్ సెంటర్లలో ఉండి ఐదు బస్సులు, రెండు మినీ లారీలు, ఐదు కార్లలో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాలతో పాటు ఒడిశాకు బయలుదేరిన వారిని అశ్వారావుపేట సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఏపీ అధికారులు నిలిపివేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రం ఇక్కడ చెల్లదని, ఏపీ అధికారుల అనుమతి ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని వారు తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా ఏపీ నోడల్ అధికారి ఏంటీ కృష్ణబాబు ఫోన్ నెంబర్ పనిచేయడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని అశ్వారావుపేట తహసీల్దార్‌తో పాటు ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. మరోవైపు ప్రయాణాల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read:కరోనా రోగుల సేవలకు సంఘీభావం: గాంధీ ఆసుపత్రి వద్ద ఇండియన్ ఆర్మీ పూల వర్షం

అందువల్ల పొరగు రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సరిహద్దుల వద్దకు వచ్చి ఎవరూ ఇబ్బందులు పడొద్దని కోరింది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం కేవలం వలస కూలీలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వేల సంఖ్యలో ఉన్న వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్‌లో పెట్టి సదుపాయాలు కల్పిస్తున్నామని.. అందువల్ల మిగిలినవారు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా దృష్ట్యా ఎక్కడి వారు అక్కడే ఉండటం క్షేమకరమని, కోవిడ్ 19పై చేస్తున్న పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయమని ఏపీ సర్కార్ అభినందించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios