జగన్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ సంఘాల నేతలపై ఏసీబీ దాడులు జరగలేదన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు.. సొంత సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులపై మాత్రం ఎలాంటి దాడులు జరగలేదని, మూడు కులాలకు చెందిన ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉద్యోగుల సమస్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాలను టార్గెట్ చేసుకుంటూ ఏసీబీ దాడులు జరిగాయని ఆరోపించారు. మూడు కులాలకు చెందిన ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకున్నారని వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు.. సొంత సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులపై మాత్రం ఎలాంటి దాడులు జరగలేదని ఆయన ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ సంఘాల నేతలపై ఏసీబీ దాడులు జరగలేదన్నారు. తాను సీఎం జగన్ బంటునేనని వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాధినేత కాబట్టి జగన్‌కు బంటునేనని ఆయన వ్యాఖ్యానించారు. తననే ఓడించలేకపోయారని.. ఇక సీఎంని ఓడిస్తారంటూ వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. ఉద్యోగుల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరిస్తోందని ప్రశంసించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను గెలిపించాలని వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలు పడుతున్నా.. చిన్నస్థాయి ఉద్యోగులకు మాత్రం ఒకటో తేలదీనే జమ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏ ఒక్కనెలలోనైనా జీతాలు ఒకటో తేదీన పడ్డాయా అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు.
ALso REad: సీఎస్‌కు ఉద్యమ నోటీసులు ఇచ్చిన ఉద్యోగ నేతలు.. చాయ్ బిస్కెట్ మీటింగ్‌లతో రాజీపడమన్న బొప్పరాజు
ఇకపోతే.. డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి జేఏసీ నేతలు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి ఉద్యమ కార్యాచరణకు సంబంధించి నోటీసులు అందజేశారు. ఉద్యోగుల ఆర్ధిక, ఇతర సమస్యల పరిష్కారం కోసమే తాము ఆందోళన చేస్తున్నట్లు వారు నోటీసుల్లో పేర్కొన్నారు. మార్చి 9న ఉద్యమం ప్రారంభిస్తామని వారు తెలిపారు.
అనంతరం అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆందోళనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తొలుత సెల్ డౌన్, పెన్ డౌన్, లంచ్ బ్రేక్‌లో ఆందోళనలు చేపడుతున్నట్లు బొప్పరాలు పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లలో స్పందన దరఖాస్తులు ఇస్తామని ఆయన వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఈసారి చాయ్ బిస్కట్ సమావేశాలకు వెళ్లేది లేదని ఆయన హెచ్చరించారు.
