అమరావతి: ఇవాళ్టి(మంగళవారం) నుండి ప్రారంభమయిన అసెంబ్లీ సమావేశాల్లో అత్యంత కీలకమైన రాష్ట్ర బడ్జెట్ 2020 తో పాటు ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. అతి ముఖ్యమైన సీఆర్డీఏ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

''అచ్చెన్నాయుడు తప్పు చేయలేదని టీడీపీ నేతలు చెప్పగలరా..? టీడీపీ సభ్యులు నల్లచొక్కాలతో సభకు రావడం కొత్త డ్రామా. రూ.150 కోట్ల అవినీతిలో అచ్చెన్న పాత్ర ఉందని తేలింది'' అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  

read more   ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం: ఉభయ సభల్లో టీడీపీ సభ్యుల నిరసన, వాకౌట్

గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఆంధ్ర ప్రదేశ్ వికేంద్రీకరణ, సీఆర్డిఏ రద్దు బిల్లుపై శాసనమండలి ఛైర్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టిడిపి నాయకులు పట్టుబట్టడంతో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి ఛైర్మన్ నిర్ణయించారు.తనకున్న విచక్షణాధికారాలతో ఈ రెండు బిల్లులను ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై అధికారపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీంతో మరోసారి సీఆర్ఢీఏ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పక్కా వ్యూహాలతో బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్దమైంది.