రాష్ట్రంలో భూమి అమ్మాలన్నా? కొనాలన్నా లంచం ఇవ్వనిదే పనికావటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.
అవినీతిలో రాష్ట్రమే నెంబర్ 1. చెప్పింది ఎవరనుకుంటున్నారా? వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డో లేక ఇంకెవరైనా విపక్ష నేతలో కాదు. అధికార టిడిపికి మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ ఎంఎల్ఏ విష్ణువర్ధన్ కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రంలో భూమి అమ్మాలన్నా? కొనాలన్నా లంచం ఇవ్వనిదే పనికావటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.
అదేవిధంగా, విశాఖపట్నంలో అవినీతి అధికారులను పట్టిస్తే రూ. 10 వేల బహుమానం ప్రకటించారు. అంతేకాదండోయ్..ప్రదానమంత్రి నరేంద్రమోడి విశాఖకు వచ్చినపుడు ఆయనతో ఫొటో దిగే అవకాశం కూడా కల్పిస్తానంటూ బంపర్ ఆఫర్ ఇవ్వటం గమనార్హం. ప్రధానితో ఫొటో దిగే అవకాశం తొలి వందమందికి కల్పిస్తానని ఎంఎల్ఏ హామీ కూడా ఇచ్చారు. పనిలో పనిగా అవినీతి నిరోదక శాఖను పటిష్టం చేయాలంటూ చంద్రబాబునాయుడుకు ఓ సలహా కూడా ఇచ్చారనుకోండి అది వేరే సంగతి.
రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోందని ఇంతకాలం సర్వే సంస్ధలు, ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను చంద్రబాబు కొట్టి పడేస్తున్నారు. అంతా ప్రతిపక్షాల కుట్రగా తీసిపారేస్తున్నారు. మరి, సాక్షాత్తు మిత్రపక్ష నేతే కాకుండా అసెంబ్లీలో భాజపా ఫ్లోర్ లీడర్ కూడా అయిన విష్ణు చేసిన వ్యాఖ్యలను సిఎం ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఇంతకీ విష్ణు అవినీతిలో రాష్ట్రం నెంబర్ 1 అని ఎందుకు బహిరంగంగా ప్రకటించినట్లో..
