రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ‘అప్పుచేసి పప్పుకూడా’ పద్దతిలో తయారైంది. ఆదాయాలు రాక, ఖర్చులు తగ్గించుకోలేక పోవటంతో ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా తయారైంది. తాజా అంచనాల ప్రకారం ఖజానా రూ. 14 వేల కోట్ల లోటులో ఉంది. అంటే, రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎలాంటి పరిస్ధితి ఉందో ఇప్పుడు అదేస్ధితిలో  ఉంది. ఇందుకు చంద్రబాబు పాలనలోని లోపాలే కారణాలు చెప్పాలి. వస్తుందనుకున్న ఆదాయాలు రాకపోవటం ఓ ఎత్తైతే చేస్తున్న ఖర్చులపై అడ్డు, అదుపు లేక పోవటం ఇంకో కారణం. దీనికి పెద్ద నోట్ల రద్దు ప్రభావం బోనస్.  

 

ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా నిర్వహిస్తున్న బడ్జెట్ సమావేశాల్లో లెక్కలు వెల్లడవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం సొంత పన్నుల ఆదాయం రూ. 40 వేల కోట్లు వస్తుందనుకుంటే వచ్చింది రూ. 33 వేల కోట్లే. కేంద్ర పన్నుల ద్వారా రావాల్సిన పన్ను వాటా రూ. 19 వేల కోట్లు కాగా వచ్చింది రూ. 13 వేల కోట్లే.  వివిధ రూపాల్లో రాష్ట్రాదాయాలు రూ. 1.04 లక్షల కోట్లుగా అంచనా వేస్తే వచ్చింది రూ. 80,596 కోట్లే. ఈ విధంగా రావాల్సిన ప్రతీ ఆదాయంలోనూ కోతే.

 

ఇంకో వైపు ఖర్చులు పెరిగిపోతోంది. దాంతో ఏమి చేయాలో ఉన్నతాధికారులకు దిక్కు తెలియటం లేదు. ఏమాటకామటే చెప్పుకోవాలి. చంద్రబాబు ముఖ్యమంత్రైన దగ్గర నుండి దుబారాకు బాగా అలవాటు పడిపోయారు. వ్యక్తిగత ప్రచారం కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయటమే కాకుండా ఆదాయాలతో పొంతనలేకుండా ఖర్చులు చేసేస్తున్నారు. అందుకనే ప్రతీసారి కేంద్రాన్ని అప్పు పరిమితి పెంచమంటూ దేబిరిస్తున్నారు. ఆదాయాలు తగ్గిపోతున్నా రాష్ట్రాభివృద్ధి మాత్రం బ్రహ్మాండమంటూ చంద్రబాబు ఊదరగొడుతున్నారు.

 

గడచిన రెండున్నరేళ్లల్లో విదేశీయాత్రల పేరుతో చంద్రబాబు చేసిన ఖర్చే విపరీతంగా ఉంది. ఇక ఉన్నతాధికారుల విదేశీయాత్రలకూ పరిమితి లేదు. తనతో పాటు అంతేసిమందిని ఎందుకు వెంట తీసుకెళుతున్నారో అర్ధం కావటం లేదు. తనతో పాటు విదేశీయాత్రలకు తీసుకెళుతున్న ఉన్నతాధికారులను తిరిగి రాగానే వారి శాఖలను మార్చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దాంతో వారిపై చేసిన ప్రజాధనం మొత్తం వృధానే. పోనీ ఇప్పటి వరకూ చేసిన విదేశీప్రయాణాల వల్ల సాధించింది ఏమన్నా ఉందా అంటే ఏమీ కనబడలేదు.  

 

ఆదాయాలు పెంచుకోలేనపుడు తెలివైన వాడు చేసే పని ఏమిటంటే ముందు ఖర్చులు తగ్గించుకోవటం. ‘చంద్రన్న కానుకలు’ నిలిపివేయాలి. ఈ కానుకల వల్ల ఏమీ ఉపయోగం ఉండదని మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పిన విషయం గమనార్హం.  విదేశీ ప్రయాణాలను నిలిపివేయాలి. పెరిగిపోతున్న ప్రాజెక్టులకు అడ్డుకట్ట వేయాలి. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారన్న అపప్రదను మూటగట్టుకుంటున్నది ప్రభుత్వం. పోయిన ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు పట్టంకట్టారంటే కారణం పాలనా పరమైన అనుభవం ఉందనుకోవటమే. పోయిన ఎన్నికల్లో తాము పొరబాటుపడ్డామని ప్రజలు అనుకుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు గడ్డుకాలం తప్పదు.