తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి తులాభారం సమర్పించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం అనంతరం స్వామివారికి తులాభారం సమర్పించారు. 

బియ్యాన్ని స్వామివారికి తులాభారంగా సమర్పించారు. 80 కేజీల బియ్యాన్ని సీఎం జగన్ తులాభారంగా సమర్పించారు. జగన్ తులాభార సమయంలో మంత్రులు ప్రజా ప్రతినిధులు ఆసక్తిగా తిలకించారు. 

తులాభారం వేస్తున్నప్పుడు సీఎం జగన్ ముసిముసి నవ్వులు ప్రదర్శించారు. నాయకులు తన వెయిట్ తెలుసుకుంటున్నారని తెలుసుకుని జగన్ అటూ ఇటూ చూస్తు నవ్వసాగారు. అటు ప్రజాప్రతినిధులు సైతం జగన్ వెయిట్ పై ఆసక్తిగా చూశారు. 

ఇకపోతే అంతకుముందు సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ఆలయ ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్ తలపై స్వామివారి శేష వస్త్రంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టువస్త్రాలు తీసుకెళ్లారు సీఎం జగన్. 

ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన సీఎం జగన్ గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఆ తర్వాత సీఎం జగన్ కు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి చిత్రపటాలతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

ఆతర్వాత పెద్ద శేషవాహన సేవలో పాల్గొని ఉత్సవ మూర్తిని దర్శించుకున్నారు సీఎం జగన్. సీఎం జగన్ తోపాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇతర నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. 


ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్: వైయస్ ఫ్యామిలీ రికార్డు