తిరుమల: కలియుగ దైవం తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. 

అంతకుముందు శ్రీవారి ఆలయ ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈవో సింఘాల్ తోపాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు జగన్ కు స్వాగతం పలికారు. 

అనంతరం ఆలయంలో జగన్ తలపై స్వామివారి శేష వస్త్రంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టువస్త్రాలు తీసుకెళ్లారు సీఎం జగన్. ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన సీఎం జగన్ గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకు పట్టు వస్త్రాలు అందజేశారు.

అనంతరం సీఎం జగన్ కు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆ తర్వాత శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం జగన్ తోపాటు వైవీసుబ్బారెడ్డి దంపతులు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అనంతరం సీఎం వైయస్ జగన్ పెద్ద శేషవాహన సేవలో పాల్గొని ఉత్సవ మూర్తిని దర్శించుకున్నారు. అంతకుముందు ధ్వజారహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. 

ఇకపోతే తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడంలో వైయస్ఆర్ కుటుంబానికి అత్యంత గౌరవం దక్కింది. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గతంలో దివంగత సీఎం వైయస్ రాజశేకర్ రెడ్డి శ్రీవారికి ముఖ్యమంత్రి హోదాలో పట్టువస్త్రాలు సమర్పించగా వైయస్ జగన్ సీఎం హోదాలు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.  

సంబంధిత వార్తలు

వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ (వీడియో)