ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్రమోడీని బుధవారం కలిశారు. వీరిద్దరి మధ్య గంటపాటు పలు అంశాలపై చర్చ జరిగింది. విభజన అంశాలు, ప్రత్యేకహోదా, పోలవరం నిధులు తదితర అంశాలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం.. మోడీని ఆహ్వానించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాల్సిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖను ఆదేశించాల్సిందిగా ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.

అలాగే పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు రూ.55,549 కోట్లకు చేరుకున్నాయని.. దీనికి పాలనాపరమైన అనుమతులు ఇంకా రాలేదని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలని జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

Also Read:ప్రధాని మోడీతో జగన్ భేటీ: రాష్ట్ర సమస్యలపై చర్చ

పోలవరం ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.3,320 కోట్లు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా కోరారు. మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేందుకు గాను ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం కోరారు. ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమైనందున కేంద్రమే తగిన నిర్ణయం తీసుకోవచ్చంటూ 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్న విషయాన్ని జగన్ గుర్తుచేశారు.

విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం అంగీకరించిందని, కాగ్ సైతం రెవెన్యూ లోటును రూ.22,948.76 కోట్లుగా అంచనా వేసిందని.. దీని ప్రకారం కేంద్రం నుంచి రూ.18,969.26 కోట్లు రావాల్సి ఉందన్నారు.

Also Read:స్థానిక ఎన్నికల్లో డబ్బులు పంచుతూ పట్టుబడితే అనర్హత, జైలు శిక్ష: ఏపీ కేబినెట్ సంచలనం

కర్నూలుకు హైకోర్టును తరలించేందుకు గాను కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రధానిని కోరారు. మూడు రాజధానులు, వికేంద్రీకరణ బిల్లును కూడా సీఎం ప్రస్తావించారు.

శాసనమండలి రద్దు అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొన్న ముఖ్యమంత్రి.. మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి మండలి అడ్డుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి రద్దుపై కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని జగన్మోహన్ రెడ్డి కోరారు.