కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలకు ఏపీ సర్కార్ తెరదించింది. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని ప్రకటించింది.

విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిని వుంచుకుని, వారికి హాని జరగకుండా టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Also Read:ఏపీలో నైట్ కర్ప్యూ... టైమింగ్స్ ఇవే...: ప్రకటించిన ఆళ్ల నాని

రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించాలని ఆయన సూచించారు. వార్డుల్లో ప్రత్యేక మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 104 కాల్ సెంటర్ పర్యవేక్షణ బాధ్యత జాయింట్ కలెక్టర్లదేనని ఆయన అన్నారు. 

మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నైట్ కర్ప్యూ విధించారు. రేపటి(శనివారం) నుంచి రాత్రి 10గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో వుంటుందని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. 

ఏపీలో కరోనా రోగులు భారీగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, ఇతర మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశమై పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కూడా మంత్రులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.