తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నైట్ కర్ప్యూ విధించారు. రేపటి(శనివారం) నుంచి రాత్రి 10గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో వుంటుందని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. 

ఏపీలో కరోనా రోగులు భారీగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, ఇతర మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశమై పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కూడా మంత్రులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. 

''కరోనా కట్టడిపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన విస్తృతంగా చర్చించాము. ప్రజల భాగస్వామ్యంతో పాటు వాక్సినేషన్ ముఖ్యమని సీఎం చెప్పారు. రాష్ట్రము లో వాక్సినేషన్ మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నాం. 18-45 వయసు ఉన్న వారికి ఉచితంగానే వ్యాక్సిన్ వేస్తాం. ఇందుకోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయనున్నాం'' అని మంత్రి వెల్లడించారు. 

read more   18-45 ఏళ్లవారికి ఉచిత వ్యాక్సిన్... ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

''సీటీ స్కాన్ పేరుమీద కొన్న ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ చేయడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు ఉండాలని సీఎం చెప్పారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నాం. ఇది నిరంతరం జరుగుతుంది. ఇలాంటి విపత్కర సందర్భంలో దోపిడీకి పాల్పడవద్దని మరోసారి వినతి చేస్తున్నా'' అన్నారు. 

''ఇక మాస్క్, భౌతిక దూరం ఉండేలా ప్రజలను భాగస్వామ్యం చేయమని సీఎం చెప్పారు. కళ్యాణ మండపాలు కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని సీఎం ఆదేశించారు. బెడ్స్ పెంచడం, కోవిడ్ రిక్రూట్మెంట్ కూడా పెంచుతున్నాం. జిల్లా స్థాయి 104 కాల్ సెంటర్లకు జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయించాం'' అని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.