కరప: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం వైయస్ జగన్. తూర్పుగోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయం వ్యస్థను ప్రారంభించిన జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. 

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లంచం లేనిదే పని జరిగి పరిస్థితి ఉండేది కాదన్నారు. పింఛన్ కు లంచం, రేషన్ కార్డుకు లంచం, ఇళ్లు కట్టుకునేందుకు లంచం, ఆఖరికి మరుగుదొడ్లకు కూడా లంచం లంచం ఇలా లంచం లేకపోతే ఏ పని చేసే పరిస్థితి ఉండేది కాదన్నారు. 

చంద్రబాబు  ప్రభుత్వంలో పాఠశాలల పరిస్థితి మరింత దయనీయంగా ఉండేదన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడేవారని కొందరైతే చదువుకు సైతం దూరమయ్యారని ఆరోపించారు. 

మరుగుదొడ్లు లేక, తాగేందుకు నీరు లేక, కాంపౌండ్ వాల్స్ లేక, స్కూల్ సరిగ్గా లేకపోవడం వంటి ఎన్నో లోటుపాట్లతో విద్యావ్యవస్థ ఉండేదన్నారు. తనకు మూడు సంవత్సరాలు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు సీఎం జగన్. 

మూడేళ్లు సమయం ఇస్తే ప్రతీ స్కూల్ లో మార్పులు తీసుకువస్తామన్నారు. ప్రతీ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పిస్తామని తెలిపారు. సంవత్సరానికి 15వేల స్కూల్స్ చొప్పున మెరుగు పరిచి గ్రామ సచివాలయాల్లో నాడు నేడు అని ఫోటోలు కూడా పెడతామన్నారు. 

అలాగే నిరక్షరాస్యతను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే ఆకాంక్షతో అమ్మఒడి అనే పథకాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. జవనరి 26 నుంచి అమ్మఒడి పథకం ద్వారా ప్రతీ తల్లికి రూ.15వేలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 

మరోవైపు పీహెచ్ సీ భవనాలను కూడా మారుస్తామన్నారు. పీహెచ్ సీ, మండల స్థాయి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్లను పూర్తిగా రూపుమాపుతామన్నారు. వాటి చరిత్ర మారుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.  

ప్రభుత్వ ఆస్పత్రులు అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నుంచి ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలనే పరిస్థితి తీసుకువస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకలు కొరికి చిన్నారి దుర్మరణం చెందిన పరిస్థితి కూడా చూసినట్లు తెలిపారు. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యుత్ లేకపోవడం వల్ల సెల్ ఫోన్లతోనే ఆపరేషన్లు చేసిన దుస్థితి కూడా చూసినట్లు గుర్తు చేశారు. ఆస్పత్రిలో స్టాప్ ఉండని పరిస్థితి చూశామని కొన్ని ఆస్పత్రుల్లో పరికరాలు లేని దుస్థితి కూడా ఎదుర్కొన్నామని తెలిపారు.  

రాబోయే మూడేళ్లలో ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రి స్థితిగతులను మార్చివేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సంవత్సరానికి కొన్ని ఆస్పత్రులను గుర్తించి వాటిని మెరుగుపరుస్తామన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించేలా చొరవ చూపుతానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

గత ఎన్నికల్లో ఓటేయ్యని వారు వచ్చే ఎన్నికల్లో ఓటేసేలా సేవలందించాలి: సీఎం జగన్

ఏపీలో అమల్లోకి గ్రామ సచివాలయం: ప్రారంభించిన సీఎం వైయస్ జగన్