కాకినాడ: జాతిపిత మహాత్మ గాంధీ స్ఫూర్తితో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు ఏపీ సీఎం వైయస్ జగన్. తూర్పుగోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్ గాంధీని కొనియాడారు. 

మన భారతీయ ఆత్మ అంత కూడా గ్రామాల్లోనే ఉందని మహాత్మగాంధీ చెప్పారని సీఎం వైయస్ జగన్ గుర్తు చేశారు. గ్రామాలే లేకపోతే దేశమే ఉండదని ఆనాడే గాంధీ గుర్తించారని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

మహాత్మగాంధీజీ కోరుకున్నట్లే గ్రామ సచివాలయం వ్యవస్థకు అంకురార్పణ చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా జరగనిది, రాష్ట్రాల్లో కనిపించని విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. 

ప్రతీ 2000 మంది జనాభాకు 10 నుంచి 12 మందికి కొత్త ఉద్యోగాలు కల్పించి గ్రామ సచివాలయం వ్యవస్థను నిర్మించినట్లు తెలిపారు. దేశచరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 

ప్రభుత్వ పరిపాలనను ప్రతీ గడపకు తీసుకెళ్లాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. వివక్షకు ఎక్కడా తావివ్వకుండా, అవినీతికి తావు లేకుండా పాలన అందించాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చినట్లు తెలిపారు. 

గ్రామ సచివాలయంతోపాటు ప్రతీ గ్రామంలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. నాలుగునెలల్లో అక్షరాల 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం కావచ్చు అన్నారు. 

తూర్పుగోదావరి జిల్లాలో పట్టణ, గ్రామ సచివాలయాలు 1587 ఉంటే వాటిలో 13640 మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇది ఒక సరికొత్త రికార్డు అని స్పష్టం చేశారు. అలాగే 30,558 గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు సైతం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి ఒక్క జిల్లాలోనే 44,109 ఉద్యోగాలు కల్పించినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.  

గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు 35శాఖలకు సంబంధించి 500 సేవలు అందించాలని అమలులోకి రానున్నాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. అక్టోబర్ 2న చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం జనవరి నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుందన్నారు. 

గ్రామసచివాలయాల్లో త్వరలో మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రెండు నెలల్లో మౌళిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ మెుదటి మాసంలో సమస్యలు పరిష్కరించి జనవరి 1 వచ్చే సరికి గ్రామ సచివాలయాలు 35 శాఖలకు సంబంధించిన 500 సేవలనుు ప్రతీ పేదవాడికి అందజేయనున్నట్లు తెలిపారు. 

పేదవాడి ముఖంలో చిరునవ్వు అందించేలా పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రతీ వాలంటీర్ కు స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 50 కుటుంబాల బాధ్యత గ్రామవాలంటీర్ తీసుకుంటాడని తెలిపారు. 

గ్రామవాలంటీర్ ఆ 50 కుటుంబాలకు పెద్దకొడుకుగా వ్యవహరిస్తారన్నారు. గ్రామ సచివాలయంతో అనుసంధానమై ప్రజల ఇంటికే ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత వాలంటీర్ తీసుకోవాలని జగన్ సూచించారు.   

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తాను చేపట్టిన పాదయాత్రలో గ్రామాల్లో నెలకొన్న ప్రతీ సమస్యను తాను గమనించినట్లు జగన్ తెలిపారు. అసలు ప్రభుత్వమే లేదనే భావన ప్రజల్లో ఉండేదన్నారు. గ్రామాల్లో మంచి అనే పదం లేకుండా పోయిన పరిస్థితి అని చెప్పుకొచ్చారు.  

గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో పాలనను వారి కాళ్ల దగ్గరకే అందించేలా సచివాలయం వ్యవస్థలను తీసుకు వచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. మెుత్తం వ్యవస్థ రూపు రేఖలు మార్చబోతున్నట్లు తెలిపారు.  

ఈ సందర్భంగా గ్రామ వార్డు, సచివాలయం ఉద్యోగులకు, గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. రాజ్యాధికారం చెలాయించేందుకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ప్రజల మీద అధికారం చెలాయించేందుకు ఈ వ్యవస్థలను తీసుకురాలేదన్నారు. 

మనమంతా ప్రజా సేవకులం అనే విషయాన్ని గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. 

పారదర్శకంగా సేవలు అందించాలని సీఎం జగన్ కోరారు. పటిష్టతమైన వ్యవస్థతో ముందుకు వెళ్లాలని సూచించారు. మనం చేసే సేవ ప్రతీ ఒక్కరి హృదయాన్ని తాకాలని కోరారు. గత ఎన్నికల్లో ఓటువేయని వారు కూడా మన సేవలను చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే పరిస్థితి తీసుకురావాలని సీఎం జగన్ సూచించారు.  

ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకు రావొద్దన్నారు. అవినీతి రహితంగా పాలన అందించాలని సూచించారు. గ్రామవాలంటీర్, గ్రామ సచివాలయం ఉద్యోగులు తప్పులు చేసినా, అవినీతికి పాల్పడినా, వివక్షకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

డయల్ 1092 టోల్ ఫ్రీ నెంబర్ కి నేరుగా సీఎం పేషీకి  ఫిర్యాదులు చేయవచ్చునని చెప్పుకొచ్చారు.గ్రామ వాలంటీర్లు, సచివాలయాల్లో పనిచేస్తున్న తన సొంత తమ్ముళ్లకు విజ్ఞప్తి ఒక్కటే వివక్ష పాటించొద్దు, పారదర్శకంగా పాలన అందించాలని జగన్ హితవు పలికారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో అమల్లోకి గ్రామ సచివాలయం: ప్రారంభించిన సీఎం వైయస్ జగన్