Asianet News TeluguAsianet News Telugu

వైద్యశాఖపై మేధోమథనం... భారీ ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ‘మన పాలన–మీ సూచన’కార్యక్రమం జరిగింది. అయిదో రోజు కార్యక్రమంలో భాగంగా ‘వైద్యం–ఆరోగ్యం’ పై ముఖ్యమంత్రి జగన్  మేధోమథనం చేశారు.
 లబ్ధిదారులు, వైద్య నిపుణులు, అధికారులతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. 

AP CM Jagan Review Meeting on health and medical department
Author
Amaravathi, First Published May 29, 2020, 6:26 PM IST

అమరావతి: ఆస్పత్రుల్లో అన్ని మౌలిక వసతులు మెరుగుపర్చడంతో పాటు 9712 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ ప్రకటించారు. వారం రోజుల్లో (జూన్‌ మొదటి వారంలో) నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, జాతీయ ప్రమాణాల (ఐపీహెచ్‌ఎస్‌)కు అనుగుణంగా నెలన్నర వ్యవధిలో నియామకాలు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. 

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ‘మన పాలన–మీ సూచన’కార్యక్రమం జరిగింది. అయిదో రోజు కార్యక్రమంలో భాగంగా ‘వైద్యం–ఆరోగ్యం’ పై ముఖ్యమంత్రి జగన్  మేధోమథనం చేశారు.
 లబ్ధిదారులు, వైద్య నిపుణులు, అధికారులతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమంలో సమూల మార్పులు చేయడంతో పాటు, కొత్తవాటి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 టీచింగ్‌ ఆస్పత్రులు ఉండగా, కొత్తగా మరో 16 ఏర్పాటు చేస్తున్నామని, దీంతో వాటి సంఖ్య 27కు చేరుకుంటుందని, మరోవైపు గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రూ.12,270 కోట్లతో చేపడుతున్న ఈ పనులకు ఆగస్టులో టెండర్లు పిల్చి, మూడేళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ ఉంటుందని, ప్రజారోగ్యంపై మొత్తం మీద రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ క్యూఆర్‌ కోడ్‌ కార్డులు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 1.33 కోట్ల మందికి జారీ చేశామని, మిగిలినవి మరో 2 వారాల్లో పంపిణీ చేస్తామని జగన్‌ వెల్లడించారు. జూలై 1న కొత్త 108, 104 సర్వీసులు మొత్తం 1060 వాహనాలు ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు ఆరోజు నాటికి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక బైక్,  థర్మో బ్యాగ్‌ కూడా ఇస్తామని, తద్వారా టెలి మెడిసిన్‌లో ఇంకా వేగంగా మందుల డోర్‌ డెలివరీ చేస్తామని చెప్పారు. 

read more   రూ. 5 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి కూడ ఆరోగ్యశ్రీ: జగన్

ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 వేల వ్యాధులు చేర్చి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టామన్న సీఎం, జూలై 8 నుంచి మరో 6 జిల్లాలలో, ఆ తర్వాత దీపావళి నుంచి మిగిలిన 6 జిల్లాలకు ఆ ప్రాజెక్టు విస్తరిస్తామని వెల్లడించారు.ఆరోగ్య ఆసరాలో 9 రకాల వ్యాధిగ్రస్తులకు రూ.3 వేల నుంచి రూ.10 వేల పెన్షన్‌ వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దనే పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కోవిడ్‌ను అన్ని విధాల ఎదుర్కోవడానికి సర్వం సిద్ధంగా ఉన్నామన్న ఆయన, వైద్యులు, సిబ్బంది, ఆస్పత్రులు, బెడ్లు, వెంటిలేటర్లు అన్నీ రెడీగా ఉంచామని వివరించారు.

విప్లవాత్మక మార్పులకు యోచన

గత ఏడాది కాలంలో వివిధ పథకాలు అమలు చేస్తూనే ఆరోగ్య రంగంలో రెండు అడుగులు ముందుకు వేశామని, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆలోచన చేశామని, ఆ దిశలో అత్యున్నత స్థానంతో అడుగులు ముందుకు వేయగలిగామని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వం బకాయిలు పెట్టినా కూడా ముందుకు వెళ్లామని ఆయన చెప్పారు. ఆరోగ్య రంగం అనగానే మనకు గతంలో 108, 104 సర్వీసులు, కుయ్‌ కుయ్‌ అన్న శబ్ధం వినిపించేదని గుర్తు చేశారు. 

ఆ రెండింటికీ అత్యంత ప్రాధాన్యం:

పేదలు అప్పుల పాలయ్యే పరిస్థితి రెండు సందర్భాలలో వస్తుందన్న సీఎం, ఒకటి అనారోగ్యం కాగా, రెండోది పిల్లల ఫీజులు అని చెప్పారు. అందుకే దివంగత నేత వైయస్సార్‌ ఈ రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చారని, కానీ ఆయన తర్వాత ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పారు.

దారుణస్థితిలో ఆస్పత్రులు

గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఏమిటో చూశామన్న సీఎం ఒకటి రెండు ఘటనలు ప్రస్తావించారు. ఆస్పత్రుల్లో పిల్లలను ఎలుకలు కొరికాయని, సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో ఆపరేషన్లు చేశారని గుర్తు చేశారు. అంత దారుణ స్థితిలో ఆస్పత్రులు పని చేశాయన్న ముఖ్యమంత్రి, వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయలేదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆస్పత్రుల్లో కాంట్రాక్టు రూపంలో డబ్బులు ఇచ్చినా, సేవలు మాత్రం అందలేదని అన్నారు. అందుకే ఆ పరిస్థితి మార్చాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది మేనిఫెస్టోలో పెట్టామని, కేవలం రెండు పేజీలు మాత్రమే ఉన్న మేనిఫెస్టో ఇవాళ అందరి దగ్గర ఉందని చెప్పారు.

క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios