క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో తానెప్పుడూ రాజీపడనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం రూ.5కే పేదలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

పేదలకు కడుపునిండా అన్నం పెట్టిన ఎన్టీఆర్‌ పేరుతో క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. అయితే.. వాటిని చక్కగా ఉంచుకోవాల్సిన  బాధ్యత మాత్రం ప్రజలదేనని ఆయన అన్నారు. ప్రతి క్యాంటీన్‌ దగ్గర 300 మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. రూ.73 విలువైన ఆహారం రాయితీపై రూ.5కే అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 

203 అన్న క్యాంటీన్ల ద్వారా 2.50 లక్షల మందికి అల్పాహారం, భోజనం అందజేస్తామన్నారు. పేదలు, వృద్ధులకు అన్న క్యాంటీన్లు ఒక వరమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
 
ఉదయం విజయవాడలోని విద్యాధరపురంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రజలతో కలిసి భోజనం చేశారు. ఆహారం ఎలా ఉందని మహిళలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్‌లో భోజనం బాగుందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే క్యాంటీన్‌లోని ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ద్వారా ఫీడ్‌బ్యాక్‌ సీఎం చంద్రబాబు నమోదు చేశారు.