అమరావతి: త్వరలోనే  ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలోకి మైనార్టీలకు  చోటు కల్పించనున్నారు. అయితే  అంతేకాదు మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవిని  కట్టబెట్టాలని డిమాండ్ కూడ ఉంది.అయితే  త్వరలోనే మంత్రివిస్తరణ చేయనున్నట్టు చంద్రబాబునాయుడు కూడ ధృవీకరించారు.

ఎన్డీఏ  నుడి టీడీపీ వైదొలిగింది. దీంతో మైనార్టీలకు మరింత దగ్గరయ్యేందుకు  టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే  గత మాసంలో గుంటూరులో  టీడీపీ హమారా..చంద్రబాబునాయుడు హమారా  పేరుతో సభను కూడ నిర్వహించారు.

ఈ సభలోనే  మైనార్టీలకు కేబినెట్ మంత్రి పదవిని ఇస్తామని  కూడ చంద్రబాబునాయుడు ప్రకటించారు.  అయితే ఇప్పటికే  ఏపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అయితే మైనార్టీలకు కేబినెట్ లో చోటు కల్పించడంతో పాటు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని కూడ మైనార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  అయితే ఇప్పటికిప్పుడే మైనార్టీ నేతలకు  డిప్యూటీ సీఎం హోదా ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

బీసీ సామాజిక వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తి, కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పలకు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. అయితే  ఎన్డీఏతో తెగదెంపులు  చేసుకోవడంతో  రాష్ట్ర కేబినెట్ లో ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు కూడ ఈ ఏడాది ఏప్రిల్ లో తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు.

దీంతో ఈ రెండు పదవులు కూడ ఖాళీగా ఉన్నాయి. మైనార్టీలకు చోటు కల్పించే ఉద్దేశ్యంతోనే  కేబినెట్ విస్తరణ  చేయనున్నారు.  వాస్తవానికి గత నెలలోనే  ఏపీ కేబినెట్ విస్తరణ జరగాల్సి ఉంది.

ఆగష్టు 29వ తేదీన తెలంగాణలోని నార్కట్ పల్లి మండలం అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత, చంద్రబాబునాయుడు బావ మరిది హరికృష్ణ మృతి చెందాడు. 

హరికృష్ణ మృతి కారణంగా రెండు రోజుల పాటు  బాబు హైద్రాబాద్‌లోనే గడిపాడు.  హరికృష్ణ మృతి కారణంగానే  ఏపీ కేబినెట్ విస్తరణ వాయిదా పడింది. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం నాడు ధృవీకరించారు.

ఇదిలా ఉంటే  ఎమ్మెల్సీ  ఎంఏ షరీఫ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  ఇప్పటికే  ఎన్ఎండీ ఫరూక్ శాసనమండలి వైఎస్ ఛైర్మెన్ గా  కొనసాగుతున్నారు. దీంతో ఫరూక్ కు మంత్రి పదవి ఉండకపోవచ్చనే ప్రచారం సాగుతోంది.  షరీప్ కే మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వార్తలు చదవండి

2019 మే నాటికి పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు

మహేష్ విషయంలో నమ్రతతో నేరుగా డీల్ చేశారు.. 'మా' వైఖరిపై నరేష్ గుస్సా!

టీ.కాంగ్రెస్ నేత శ్రవణ్‌కు లీగల్ నోటీసులు

సెంచరీ దాటిస్తారేమో: పెట్రోల్, రూపాయి క్షీణతపై మోడీపై బాబు సెటైర్