పాకిస్థాన్ భూభాగంలో ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం నిర్వహించిన "ఆపరేషన్ సింధూర్" పై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు.
Operation Sindoor : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిమరీ వైమానిక దాడులకు దిగింది భారత ఆర్మీ. ''ఆపరేషన్ సింధూర్' పేరిట చేపట్టిన ఈ మిలటరీ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది.. భారత యుద్దవిమానాల దాడిలో పాక్ లో ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం అయ్యాయి. చాలామంది ఉగ్రవాదులు హతమయ్యారు.
మంగళవారం అర్ధరాత్రి చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ పై రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు.
ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పై ఎక్స్ లో చేసిన పోస్ట్ కు చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. 'జైహింద్' అంటూ రిప్లై ఇచ్చారు. ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా 'జైహింద్... న్యాయం జరిగింది' అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం చేపట్టిన సాహసోపేత చర్యలను ఏపీ సీఎం, ఆయన తనయుడు చాలా సింపుల్ పదంతో అభినందించారు.
వైఎస్ జగన్ రియాక్షన్
ఇక ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆపరేషన్ సింధూర్ పై రియాక్ట్ అయ్యారు. ''పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యింది. భారత సారభౌమత్వాన్ని కాపాడటం, పౌరులను కాపాడటంలో ఇలాంటి చర్యలు ప్రతిబింబిస్తాయి. ప్రతిఒక్కరు మీ వెంట నిలబడతారు'' అంటూ ఎక్స్ లో ట్వీట్ చేసారు.


