న్యూఢిల్లీ: ఈసీపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈసీ నిర్ణయాలు చాలా వివాదాస్పదంగా ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ తోపాటు పలు అంశాలపై 10 పేజీల ఫిర్యాదును కేంద్ర ఎన్నికల కమిషనర్ కు అందజేశారు. 

శుక్రవారం ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను కలిసిన చంద్రబాబు పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. ఏపీలో ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీ ఈసీకి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేస్తే మాత్రం ఈసీ పట్టించుకుంటోందని స్పష్టం చేశారు. టీడీపీ ఏడు అసెంబ్లీ నియోజక వర్గంలో రీ పోలింగ్ నిర్వహించాలని కోరితే ఈసీ పట్టించుకోలేదన్నారు. 

కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తే ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారని ఇది సరికాదన్నారు. ఈసీకి లేని అధికారాలను అమలు చేస్తోందన్నారు. ఏపీ, పశ్చిమ బెంగాల్ లో అధికారులను బదిలీ చేస్తున్నారని ఇది ఈసీ పరిధిలో లేదనన్నారు. 

ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం సమయం గడువు ముగించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. భారత జాతిపిత మహాత్మగాంధీపై బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఈసీ ఇప్పటికీ స్పందించలేదన్నారు. 

జాతిపితను అంటే పట్టించుకోరా అని నిలదీశారు. ఇకపోతే పశ్చిమబెంగాల్ లో జరిగిన దాడిపై ఈసీ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టికల్ 324 ప్రయోగిస్తారా అంటూ మండిపడ్డారు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అంటూ నిలదీశారు. 

రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం కాలరాస్తారా అంటూ విరుచుకుపడ్డారు. తాను రాజకీయాల్లో సీనియర్ అని అయితే ఇలాంటి ఈసీని ఎన్నడూ చూడలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీకి ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. 

మోదీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై తాము చర్చకు పిలిచినా ఏనాడు మోదీ స్పందించలేదన్నారు. తనను ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రతీ దానికి సమాధానం చెప్తానని కానీ మోదీ మాత్రం ఏమీ చెప్పరని దాట వేస్తారన్నారు. కేవలం రెడీమేడ్ గా రాసుకున్న స్క్రిప్ట్ మాత్రమే చదువుతారని ఎద్దేవా చేశారు. ఈ పరిణామాలే మోదీ ఓటమికి నిదర్శనమన్నారు చంద్రబాబు.  

ఈ వార్తలు కూడా చదవండి

హస్తినకు చేరిన రీపోలింగ్ వ్యహారం: సిఈసీకి చంద్రబాబు ఫిర్యాదు