అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఈ వైరస్ భయం రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంతో నివాసముండే క్యాంప్ కార్యాలయానికి పాకింది. తాడేపల్లి క్యాంప్ ఆపీసులో పనిచేసే 10 మంది భద్రత సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. 

దీంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమైన క్యాంప్ కార్యాలయంలో శానిటైజేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే ఇతర సిబ్బందికి కూడా కరోనా టెస్టులు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఆయన కుటుంబసభ్యుల కోసం మరిన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు క్యాంప్ ఆపీస్ అధికారులు. 

read more   ఏపీలో కరోనా విశ్వరూపం: ఒక్కరోజే 12 మంది మృతి,17 వేలు దాటిన కేసులు

మరోవైపు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో గతవారం రోజులుగా అతడిని కలిసిన రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో  ఆందోళన మొదలయ్యింది. 

అయితే రోశయ్య ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా కలవడం మరింత ఆందోళనకరంగా మారింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో గత నెల 24వ తేదీన   జరిగిన కాపు నేస్తం కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి నాని, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఇతర అధికారపార్టీ ఎమ్మెల్యేలు, వైసిపి కాపు నాయకులు పాల్గొన్నారు. 

 అయితే రోశయ్యకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరిలోనూ ఆందోళన మొదలయ్యింది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి  కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికి కూడా కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. 

ఇకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారిక నివాసం ప్రగతిభవన్ లో  పనిచేసే ఐదుగురికి కరోనావైరస్ సోకింది. దాంతో ప్రభుత్వ వర్గాల్లో కలకలం చోటు చేసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. 

ఐదుగురు ఉద్యోగులు తిరిగిన ప్రాంతాల్లో అధికారులు శానిటైజ్ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా ముఖ్యమంత్రి కెసీఆర్ గజ్వెల్ లోని తన నివాసగృగహంలో ఉంటున్నారు. అయితే, ప్రగతి భవన్ ఉద్యోగులకు కరోనా సోకిన విషయంపై ప్రభుత్వం ఏ విధమైన అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఈ విషయంపై మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గత వారం రోజుల్లో దాదాపు గా 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో వైద్యాధికారుల పర్యవేక్షణ లో ప్రగతి భవన్‌ ను శానిటైజేషన్ చేస్తున్నారు.