చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్.. రేపు వాదనలు, బెయిల్ కోసం బాబు లాయర్ల యత్నాలు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తమ కస్టడీకి అనుమతించాలని కోరుతూ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం దీనిపై వాదనలు జరగనున్నాయి.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశం వుంది. మరోవైపు ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
అంతకుముందు స్కిల్ డెవలప్‌మెంట్ పేరిట చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘంగా ఏడున్నర గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సాయంత్రం గం.6.50ని.ల సమయంలో చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 22 వరకూ ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
Also Read: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం .. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
అయితే చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్‌ను సిఐడీ అధికారులు ఆదివారం ఉదయమే కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో 2021లోనే ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, దీనిపై విచారించేందుకు చంద్రబాబును 15 రోజుల కస్టడీ ఇవ్వాలని సిఐడీ కోరింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ 34 అభియోగాలను చంద్రబాబుపై నమోదు చేసింది. రిమాండ్ రిపోర్ట్‌లో అన్ని ఆంశాలను పకడ్భందీగా చేర్చిన సీఐడీ రూ. 271 కోట్ల స్కిల్ స్కామ్ సూత్రధారి చంద్రబాబేనంటూ బలంగా వాదించింది. సీఐడీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆయన వాదనతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించింది.
మరోవైపు.. స్కిల్ స్కాం రాజకీయ ప్రేరేపితమని, చంద్రబాబును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తరపు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా వాదించారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సీఐడీ వ్యవహరించిందని లూథ్రా వాదనలు వినిపించినా కోర్టు ఏకీభవించలేదు. ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సబబు కాదని, ఆ సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని సిద్ధార్థ లూథ్రా వాదించారు.
అలాగే రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు. దీంతో తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. అనంతరం సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. శనివారం ఉదయం 6 గంటలకే చంద్రబాబును అరెస్ట్ చేశామని, 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశామన్నారు.