ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం .. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడకు ఏసీబీ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడకు ఏసీబీ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తి బెంచ్ మీదికి వచ్చిన తర్వాత కోర్టు హాలు నుంచి అందరినీ బయటకు పంపించారు. 30 మంది మాత్రమే ఉండాలని ఆదేశించారు. ఆ తర్వాత తీర్పును చదివారు. సిఐడి తరఫు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. కేసులో చంద్రబాబుకు సెక్షన్ 409 వర్తిస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ సెక్షన్ కు నాన్ బెయిలబుల్ వర్తిస్తుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై ఆధారాలున్నాయని న్యాయమూర్తి అన్నారు.
చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు రేపు సోమవారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. జ్యూడిషియల్ రిమాండ్ ను హౌస్ అరెస్టుగా మార్చాలని చంద్రబాబు న్యాయవాదులు చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైలుకు వెళ్తున్న తొలి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే.
దాదాపుగా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పు కోసం దాదాపు సాయంత్రం 7 గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది. కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత తుది ఫలితం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. చంద్రబాబు ఎంపి కేశినేని నానితో మాట్లాడడం కనిపించింది. ఆయన తన తరఫు న్యాయమూర్తులతో కూడా మాట్లాడారు. జ్యూడిషియల్ రిమాండును హౌస్ అరెస్టుగా మార్చాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు.
అంతకుముందు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకకటేశ్వరరావు వాదనలువినిపిస్తున్నారు. అయితే ఇరుపక్షాల వాదనలు వాడివేడిగా సాగాయి.
చంద్రబాబు కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీఐడీ కోరగా.. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూద్రా వాదించారు. సుదీర్ఘంగా సాగిన వాదనలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. దీంతో ఏసీబీ న్యాయమూర్తి నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్టును సీఐడీ ఇవాళ ఉదయమే కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో 2021లోనే ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపింది. ఆయనను విచారించేందుకు 15 రోజుల కస్టడీకి అనుమతించాలని సీఐడీ .. కోర్టును కోరింది.
అసలేంటీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం:
ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2015లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,350 కోట్ల ప్రాజెక్టుకు డీల్ కుదుర్చుకుంది. జర్మనీ దేశానికి చెందిన ‘సీమెన్’ అనే సంస్థ ద్వారా యువకులకు పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కాగా.. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది శాతం షేర్ ను చెల్లించాల్సి ఉంది.
అయితే ఏపీ ప్రభుత్వం షేర్ చెల్లింపుల్లో రూ.240 కోట్లను దారి మళ్లించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పాటు నకిలీ బిల్లులు తయారు చేసి, ఇన్‌వాయిస్‌లు సృష్టించి జీఎస్టీని ఎగవేశారని అభియోగాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఏపీ స్కిల్ కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ఏపీ సీఐడీకీ ఫిర్యాదు అందించారు.
కాగా.. గతంలోనే ఆ సంస్థ చైర్మన్, డైరెక్టర్ తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. 2021 జూలై నెలలో ఈ ఆరోపణలపై విచారణ జరపాలని వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సీఐడీ రిపోర్టును బేస్ చేసుకొని ఆర్థిక లావాదేవీలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఫొకస్ పెట్టింది.