అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణలో ఇద్దరికి అవకాశం కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇద్దరికి శాఖలను సైతం ప్రకటించింది ఏపీ సర్కార్. ఎన్.డీ ఫరూక్ కు వైద్యఆరోగ్యశాఖ, కిడారి శ్రవణ్ కు గిరిజన సంక్షేమ శాఖలను కేటాయించింది. 

మంత్రి వర్గ విస్తరణలో శాసనమండలి చైర్మన్ ఎన్డీ ఫరూక్ కు, అరకు దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రవణ్ లకు అవకాశం కల్పించినట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇద్దరితో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పలు అంశాలపై సూచనలు కూడా చేశారు. కేబినేట్ లోని సహ మంత్రులతో మరియు జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. 

అటు శ్రవణ్ కు సైతం పలు సూచనలు చేశారు చంద్రబాబు నాయుడు. చిన్నోడివైనా అవకాశం ఇచ్చానని సమర్ధవంతంగా పనిచెయ్యాలని సూచించారు. మంచిగా పనిచేస్తూ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని చంద్రబాబు శ్రవణ్ తో చెప్పారు. 

ఇకపోతే మంత్రి వర్గ విస్తరణలో అవకాశం వస్తుందని ఎదురుచూసిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్ కు శాసనమండలి చైర్మన్ పదవిని, కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషాను అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా నియమించారు చంద్రబాబు. భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఇకపోతే ఒకేసారి మూడు కీలక పదవులను ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు కట్టబెట్టడం విశేషం. మంత్రి వర్గ విస్తరణలో ఒకరికి అవకాశం ఇవ్వడంతోపాటు శాసన మండలి చైర్మన్ గా, అసెంబ్లీ విప్ గా మూడు పదవులను ముస్లిం సామాజిక వర్గానికే కేటాయించడంతో ముస్లిం సోదరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
  
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రావెల కిశోర్ బాబుకు అవకాశం ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత వచ్చిన మంత్రి వర్గ విస్తరణలో 
రావెల కిషోర్ బాబుకు ఉద్వాసన పలకడంతో ఆ శాఖను నక్కా ఆనందబాబుకు కేటాయించారు. 

అయితే మెుదటి నుంచి గిరిజనులకే గిరిజన సంక్షేమ శాఖ కేటాయించాలని ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలోనే గిడ్డి ఈశ్వరి వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. మంత్రి వర్గ విస్తరణలో తనకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం కల్పిస్తారని ఆశపడ్డారు. కానీ ఆమె ఆశలు ఆడియాశలు అయ్యాయి. 

ఇకపోతే 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు వైద్య ఆరోగ్యశాఖను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు కేటాయించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు మూడు కలిసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావులకు మంత్రులుగా అవకాశం ఇచ్చింది.

అయితే ప్రత్యేక హోదా అంశం, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ టీడీపీ ఎన్.డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిన నేపథ్యంలో రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న కామినేని శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. 

ఆనాటి నుంచి వైద్యఆరోగ్య శాఖ సీఎం దగ్గరే ఉంది. అయితే ఆ శాఖను ఎన్ డీ ఫరూక్ కు కేటాయించారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్ డీ ఫరూక్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కిడారి శ్రవణ్ లు ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
  

ఈ వార్తలు కూడా చదవండి

చిన్నోడివైనా అవకాశం ఇచ్చా, మంచి పేరు తీసుకురా:శ్రవణ్ తో చంద్రబాబు

గవర్నర్ ఒప్పుకోరనుకున్నారేమో,అందుకే విప్:చాంద్ భాషా

బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్

మంత్రి పదవి ఆశించా, కౌన్సిల్ చైర్మన్ అయినా ఒకే:షరీఫ్

మంత్రివర్గంలో మైనార్టీలకు చోటుపై చంద్రబాబు వివరణ