కేంద్రానికే చంద్రబాబు సవాలు

First Published 16, Dec 2017, 9:37 PM IST
Ap cabinet approves police act 2017
Highlights
  • అందరూ అనుమానించినట్లుగానే డిజిపి నియామకానికి సంబంధించి చంద్రబాబు కేంద్రానికే సవాలు విసిరారు.
  • అయితే డిజిపి సాంబశివరావుకు పొడిగింపు మాత్రం లేదని తేలిపోయింది

అందరూ అనుమానించినట్లుగానే డిజిపి నియామకానికి సంబంధించి చంద్రబాబు కేంద్రానికే సవాలు విసిరారు. డిజిపి నియామకాన్ని కేంద్రప్రభుత్వం నుండి రాష్ట్రం తన చేతుల్లోకి తీసేసుకుంది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2014 పోలీసు యాక్ట్ సవరణకు ఆమోదం దక్కటంతో పోలీసు బాస్ నియామకానికి కేంద్రం ఆమోదం అవసరమే లేదు.  ఇటీవలే డిజిపిగా నియమితులైన సాంబశివరావు నియామకంలో ఏర్పడిన ప్రతిష్టంభనే ప్రభుత్వం తాజా నిర్ణయానికి కారణమైంది. 2014 పోలీసు యాక్ట్ కు సవరణలు చేసి కొత్తగా 2017 పోలీసు యాక్ట్ కు ఆమోదం తెలిపింది. మామూలుగా అయితే, డిజిపి నియామకానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం కొన్ని పేర్లతో ఓ జాబితాను కేంద్రానికి పంపుతుంది. అందులో నుండి మూడు పేర్లను ఎంపిక చేసి తుది జాబితాను కేంద్రం, రాష్ట్రానికి పంపుతుంది. అందులో నుండి ముఖ్యమంత్రి ఓ పేరును ఎంపిక చేస్తారు.

డిజిపి నియామకం చేయాల్సి వచ్చినపుడు రాష్ట్రప్రభుత్వం ఐదుమందితో కూడిన జాబితాను కేంద్రానికి పంపింది. అందులో సాంబశివరావు పేరు కూడా ఉంది. అయితే, ఆయన మరి కొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. అందుకే ఆ పేరును కేంద్రం ఆమోదించలేదు. అయితే, సాంబశివరావు నియామకం విషయంలో చంద్రబాబు బాగా పట్టుదలతో ఉన్నారు. అందుకే కేంద్ర-రాష్ట్రాల మధ్య జాబితా మూడు సార్లు తిరిగింది. జాబితా ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ వెనక్కు తగ్గలేదు.

దాంతో చంద్రబాబుకు చిర్రెత్తింది. అంతే, కేంద్రంతో సంబంధం లేకుండానే డిజిపిని రాష్ట్రప్రభుత్వమే నియమిచేసింది. అప్పట్లో ఏకపక్షంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి ఇపుడు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లైంది. మరి, ఈ నిర్ణయం భవిష్యత్తులో ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక, పనిలో పనిగా రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది మండలాల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హిజ్రాలకు నెలకు రూ. 1500 పెన్షన్ ఇవ్వాలని, రేషన్ కార్డులు జారీ చేయాలని, చిన్న వ్యాపారాలకు రుణాలు, ఇళ్ళ స్ధలాలు కూడా మంజూరు చేయాలని  నిర్ణయించింది మంత్రివర్గం.  

 

loader