ఏపి బంద్ ప్రశాంతంగా విజయవంతంగా సాగుతోంది. ఏపి ప్రయోజనాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వామపక్షాలు, కాంగ్రెస్, వైసిపి, జనసేనలు గురువారం బంద్ పిలిపిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపి ప్రస్తావన లేకపోవటంతో రాష్ట్రంలోని జనాలు మండిపోతున్నారు. జనాల మూడ్ గ్రహించిన వామపక్షాలు వెంటనే రాష్ట్రబంద్ కు పిలుపిచ్చాయి.

వామపక్షాల పిలుపుకు వైసిపి, కాంగ్రెస్, జనసేన ప్రత్యక్షంగా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రజల మనోభావాలు గమనించిన అధికార టిడిపి కూడా చివరకు పరోక్షంగా అయినా మద్దతు ప్రకటించక తప్పలేదు. ఇటు శ్రీకాకుళం జిల్లా మొదలు అటు చిత్తూరు జిల్లా వరకూ బంద్ పూర్తిగా ప్రశాంతంగా, విజయవంతంగా జరుగుతోంది. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఆర్టీసి బస్సు సర్వీసులను నిలిపేసింది. డిపోల ముందు ఆందోళనకారులు నిరసనలు తెలుపుతున్నారు.

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తగా పాఠశాలలు, కళాశాలలకు శెలవు ప్రకటించింది. వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్ధలు కూడా స్వచ్చంధంగా బంద్ కు సహకరిస్తున్నాయి. బంద్ విజయవంతానికి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన పాదయాత్రను నిలిపేసిన సంగతి అందరికీ తెలిసిందే. అధికార, ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఏకమవ్వటంతో బంద్ సంపూర్ణంగ సాగుతోంది.