అమరావతి: మంగళవారం (జూన్ 16 ) నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నెల 17న ప్రారంభించాలని నిర్ణయించిన  వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని వైసిపి ప్రభుత్వం వాయిదా వేసింది. కార్యక్రమాన్ని ఈ నెల 20 కి వాయిదా వేసినట్లు ఏపి సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ మరియు ప్రభుత్వ ఎక్స్అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు 6 నెలల ముందుగానే వైఎస్సార్ నేతన్న నేస్తం కింద వరుసగా రెండవ ఏడాది రూ. 24,000 ఆర్ధిక సాయం అందించే కార్యక్రమాన్ని జూన్ 17 న నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించిందని... కాని మంగళవారం (జూన్ 16) నుంచి  అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న దృష్ట్యా సదరు కార్యక్రమాన్ని జూన్ 20, 2020 కి వాయిదా వేయడం జరిగిందన్నారు. 

చేనేత రంగం ఆధునికీకరణకు, మర మగ్గాల పోటీని తట్టుకుని నిలబడేందుకు ఉద్ధేశించిన ఈ ఆర్థిక సాయం ద్వారా 69,308 మంది కుటుంబాలకు నేరుగా వారి ఖాతాల్లోకే నగదు జమకానుంది. ఈ నెల 20 వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీట నొక్కి ఈ నగదును జమచేస్తారని విజయ్ కుమార్ రెడ్డి  తెలియజేశారు.

read more మంత్రిగా వుండి...జగన్, విజయమ్మలను దుర్భాషలాడిన బొత్స: చినరాజప్ప

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16నే అసెంబ్లీ సమావేశాలు  ప్రారంభంకానున్నాయి. అయితే రేపే ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.మంగళవారం ఉదయం జరిగే కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత మధ్యాహ్నం ఆర్ధిక మంత్రి బుగ్గన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

 శాసనమండలిలో డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించనున్నారు.

దేశంలోనే గవర్నర్ ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించడం ఇదే తొలిసారి. బడ్జెట్‌కు ఆమోదం లభించిన తర్వాత మరుసటి రోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ బిల్లుల ఆమోదం తర్వాత శాసనసభ సమావేశాలను వాయిదా వేయనున్నట్లు సమాచారం.