గుంటూరు: ప్రజా రాజధాని అమరావతిపై గతంలో నోటికొచ్చిన అబద్దాలాడి అభాసుపాలయిన మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి అలాంటి అబద్దాలే ఆడుతున్నాడని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి రూ. 150 కోట్లు అవినీతి అంటగట్టడం ఆయన ఆడుతున్న మరో పచ్చి అబద్దమని అన్నారు. 

''అచ్చెన్నాయుడు సిఫారసు చేసింది రూ. 7.96 కోట్లకు మాత్రమే అన్నది వాస్తవం కాదా..? సిఫారసు లేఖ ఇచ్చినదానికే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తే.. వోక్స్ వేగన్ కి రూ. 10 కోట్లు కట్టబెట్టిన బొత్సని ఎందుకు అరెస్ట్ చేయకూడదు..?'' అని ప్రశ్నించారు. 

read more   టీడీపీ నేతల హత్యకు కొందరి కుట్ర.. నాకేమో జూన్ 22 డెడ్‌లైన్: బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు

''ఎర్రన్నాయుడి కుటుంబం 38 ఏళ్ల నుంచి నీతి నిజాయతీగా రాజకీయాలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అవినీతిని అచ్చెన్నాయుడు బట్టబయలు చేస్తున్నారని... బలహీన వర్గాలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతున్నారనే అక్రమ కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడలేదని పదేపదే చేసిన ప్రకటనలు బొత్స కళ్లకు కనబడలేదా..? లేక బొత్సకు పత్రికలు చదివే అలవాటు లేదా..?'' అని అన్నారు. 

''బీసీలకు 34 శాతం నుంచి 24 శాతానికి జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ తగ్గిస్తే నోరుమెదపడానికి భయపడిన బొత్సకి బీసీల గూర్చి మాట్లాడే నైతిక అర్హత లేదు. తన వ్యక్తిగత స్వార్థానికి లోబడిపోయి బీసీలకు బొత్స తీరని అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న సమయంలో జగన్ గూర్చి, ఆయన తల్లి విజయమ్మ గూర్చి నానా మాటలు అన్న బొత్స.. నేడు అదే జగన్ ప్రాపకం కోసం తెలుగుదేశంపై అబద్ధపు వ్యాఖ్యలు చేసి తన స్థాయిని మరింత దిగజార్చుకుంటున్నారు'' అని  చినరాజప్ప మండిపడ్డారు.