BJP: టీడీపీ-జనసేన పొత్తుపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. టీడీపీతో జనసేన పొత్తు గురించి పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధిష్టానానికి వివరిస్తారని, ఆ తర్వాత అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అధిష్టానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులపై ఆసక్తి నెలకొంది. మొన్నటి వరకు టీడీపీ, బీజేపీని ఒక తాటి మీదికి తెస్తానని ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కీలక నిర్ణయం ప్రకటించారు. టీడీపీ వైపు మొగ్గడంతో బీజేపీపై ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్డీయేలో లేని టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందనే ఆసక్తికర, సంశయకర ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్పందించింది.
రాష్ట్రంలో పొత్తులపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందిస్తూ ఓ స్పష్టత ఇచ్చారు. నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని, ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర బీజేపీ అందుకు కట్టుబడి ఉంటుందని వివరించారు. టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధిష్టానానికి వివరిస్తారని, ఆ వివరణ తర్వాతే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Also Read: అన్నీ సమకూర్చుకున్నాకే విశాఖకు జగన్ : వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
విశాఖపట్నంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ప్రజా వేదిక కూల్చివేత తర్వాత నుంచి రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందని ఆమె చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వేధిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం బాధాకరమని తెలిపారు.