కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేసుకోవడం మానుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన లేఖ రాశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కేంద్ర నిధులపై జగన్ సర్కార్ స్టిక్కర్లేంటంటూ ఆయన మండిపడ్డారు. ఏపీలో కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం తప్పవని , దీనిని తక్షణం ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న బియ్యానికి సంబంధించి వాహనాలపై ప్రత్యేక బోర్డులను ప్రదర్శించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. కేంద్ర పథకాల విషయంలో మార్గదర్శకాలు అమలు చేయాలన్నారు.
అంతకుముందు ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోనుందనే ప్రచారంపై గతవారం సోము వీర్రాజు మాట్లాడుతూ.. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని వెరు చెప్పారని వీర్రాజు ప్రశ్నించారు. అమిత్ షాను చంద్రబాబు కలిసినంత మాత్రాన అన్నీ ఊహించుకుంటారా అని ఆయన నిలదీశారు. అమిత్ షాతో భేటీ తర్వాత దానిపై చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదని.. కానీ వారిద్దరి మధ్య భేటీని ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు ఊహించుకుంటున్నారని సోము వీర్రాజు దుయ్యబట్టారు. రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనేది తన ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు.
ALso Read: మేమూ వైసీపీ ఒకటి కాదు.. టీడీపీతో పొత్తుండదు, మీరే ఊహించుకుంటారా : సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
వైసీపీతో తాము ఎప్పుడూ లేమని.. జగన్ ప్రభుత్వ అవినీతిపై పోరాడుతున్నామని సోము వీర్రాజు వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు తాము చేపట్టిన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాలు మారాయని , రాబోయే రోజుల్లో మరింత మారుతాయని సోము వీర్రాజు పేర్కొన్నారు. పవన్ - ముద్రగడ గొడవను కులపరమైన గొడవగా తాము భావించడం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
