తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. 24 మంది సభ్యులతో పాలకమండలిని ప్రకటించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. 24 మంది సభ్యులతో పాలకమండలిని ప్రకటించింది. అయితే ఇందులో కొందరి పేర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమేనని ఏపీ సీఎం జగన్ మరోసారి నిరూపించారని పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో మద్యం కుంభకోణంలో పాలుపంచుకున్న శరత్ చంద్రారెడ్డి, అవినీతికి పాల్పడినట్లు గుర్తించి ఢిల్లీ హైకోర్టు ఎంసీఐ నుంచి తొలగించిన కేతన్ దేశాయ్ వంటి వ్యక్తులను టీటీడీ బోర్డుకు నామినేట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు, తిరుమల ఆలయ పవిత్రతపై ఏపీ సీఎం జగన్‌కు నమ్మకం లేదని విమర్శించారు. టీటీడీ పవిత్రను మసకబరిచే నియామకాలను బీజేపీ ఖండిస్తుందని స్పష్టం చేశారు.
Also Read: టీటీడీ కొత్త పాలకమండలి : 24 మందితో జాబితా రెడీ.. ఎమ్మెల్యేలు సామినేని , పొన్నాడ సతీష్‌లకు చోటు
ఇదిలా ఉంటే, కొన్ని వారాల క్రితం టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన సందర్భంలో పురందేశ్వరి స్పందిస్తూ. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవి అనేది రాజకీయ పునరావాస పదవి కారాదు అని అన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి న్యాయం చేయగలరని అన్నారు. టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మంపై నమ్మకమున్న వారిని, అనుసరించే వాళ్లని నియమించాలని డిమాండ్ చేశారు.
ఇక, వివిధ కులాలు, ప్రాంతీయ సమీకరణలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల ప్రతినిధులతో సహా 24 మంది పేర్లను టీటీడీ పాలకమండలికి ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటా నుంచి సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (ముమ్మిడివరం), ఎం తిప్పేస్వామి (మడకశిర) చోటు దక్కించుకన్నారు. తెలంగాణ నుంచి గడ్డం సీతా రంజిత్‌రెడ్డి( ఎంపీ రంజిత్‌రెడ్డి సతీమణి) , మహారాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్‌బోరా, మిలింద్ సర్వకర్‌లకు అవకాశం కల్పించారు.
ఇదిలా ఉంటే, టీటీడీ బోర్డులో చోటు దక్కించుకున్న అరబిందో ఫార్మా డైరెక్టర్ పెనక శరత్ చంద్ర రెడ్డి.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్నారు. ఢిల్లీలో రిటైల్ లిక్కర్ వ్యాపారాన్ని పొందిన సౌత్ గ్రూప్‌కు శరత్ చంద్ర ప్రధాన సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. గతేడాది నవంబర్‌లో శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ ఏడాది జూన్‌లో ఆయన అప్రూవర్‌గా మారారు. అయితే తాజాగా టీటీడీ బోర్డులో శరత్ చంద్రారెడ్డిని నియమించడం పెను దుమారాన్ని రేపుతోంది.
