ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో మంత్రి నారాయణ హాడావిడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేసి, ఇంగ్లిష్ మీడియం మాత్రంలోనే బోధన జరగాలని సోమవారం నాడు జారీ చేసిన జీవో ని పెండింగులో పెట్టారు. ప్రజలనుంచి, ఉపాధ్యాయసంఘాల నుంచి జివొ నెంబర్ 14 మీద వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
201617 విద్యా సంవత్సరంలో 14 నెంబర్‌తో ఇచ్చిన జీవోను అమలుచేయమని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరిగా ఉంటుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
మున్సిపల్ పాఠశాలన్నింటా ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలని సోమవారం జారీ చేసిన జీవో పై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో, ఇచ్చేందుకు మంత్రి నారాయణ సిఆర్‌డిఎ కార్యాలయంలో గురువారం రాత్రి హాడావిడిగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఈ వివరణ ఇచ్చారు.
ఒక ఏడాదిగా ఫౌండేషన్ కోర్సుల్లో కొందరు విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని, వారితో పాటే తెలుగు మీడియం విద్యార్థులూ ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఫలితాలు బాగాఉండటంతో జివొ 14 నంబరు జీవో జారీ చేశామని చెప్పారు. అయితే, ఏ మీడియం విద్యార్థులు అందులోనే ఈ ఏడాది పరీక్షలు రాస్తారని తెలిపారు.
వచ్చే ఏడాదికి అన్ని సౌకర్యాలు కల్పించి ఇంగ్లిషు మీడియం అమలు చేస్తామని చెబుతూ ఈ లోపు విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చిస్తామని, ఉపాధ్యాయులకు కూడా ఇంగ్లీషు బోధనకు అవసరమైన శిక్షణ ఇస్తామని తెలిపారు.
‘జాతీయ స్థాయి పోటీ పరీక్షలు అన్ని కూడా ఇంగ్లిష్‌లోనే ఉంటున్నాయి. ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే పరీక్షల్లో ర్యాంకులు వస్తున్నాయి. తెలుగు మీడియంలో చదివిన వారికి రావడం లేదు. మొదటి వెయ్యి ర్యాంకులు సాధించిన వారిలో ఇంగ్లిష్ మీడియం వారే ఉంటున్నారు. తెలుగులో చదివిన వారు ఎంపిక కావడం లేదు,’ అని ఆయన చెప్పారు.
ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ఇస్తున్న పౌండేషన్ కోర్స్లో తమకూ శిక్షణ ఇవ్వాలని తెలుగు మీడియం విద్యార్థులు కోరుతున్నందునే తాము జివొ విడుదల చేశామని చెప్పారు.
దీన్ని ఉపాధ్యాయ సంఘాలు రాజకీయం చెయ్యవద్దని కోరుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, బోధనను పటిష్టం చేసి ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తామని మంత్రి చెప్పారు.
