శాసనసభలో టీడీపీ సభ్యుల తీరును స్పీకర్ తమ్మినేని తప్పుబట్టారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ హెచ్చరిక జారీ చేశారు.

ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ,టీడీపీ సభ్యులు పోటాపోటీగా వాదోపవాదాలకు దిగారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ప్రారంభమైన శాసనసభ కొద్దిసేపటికే వాయిదా పడింది. తిరిగి 11 గంటల ప్రాంతంలో శాసనసభ ప్రారంభం కాగా.. స్పీకర్ తమ్మినేని సభలోచోటుచేసుకున్న పరిణామాలపై అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. టీడీపీ సభ్యుల తీరును స్పీకర్ తమ్మినేని తప్పుబట్టారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ హెచ్చరిక జారీ చేశారు. 

‘‘ఈరోజు సభ ప్రారంభం కాగానే.. ఈ సభ అత్యంత గౌరవం ఇచ్చే సభాపతి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభ స్థానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయకుండా.. ఈ సభ ఔనత్యాన్ని తగ్గించేలా తొడలు కొట్టడం, మీసాలు మేలివేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇలాంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పు. 

Also Read: చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.. బాలకృష్ణ

సభ స్థానం వద్దకు వచ్చి మీసాలు మేలివేయడం వంటి చర్యలు చేపట్టిన నందమూరి బాలకృష్ణ సభ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారు. ఇది అతని మొదటి తప్పిదంగా భావించి సభ మొదటి హెచ్చరికను చేస్తుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఆయనను సభ హెచ్చరిస్తుంది. శాసనసభ నియమావళిలోని 365వ నియమాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాం. సభకు సంబంధించిన ఆస్తికి సభ్యులు ఉద్దేశపూర్వకంగా నష్టం కలగజేసినప్పుడు.. ఆ ఆస్తి విలువను సభ్యులు నుంచి రాబట్టడం జరుగుతుంది. ఈరోజు సభలో కే శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌లు.. సభా స్థానంలో ఉన్న ఫైల్‌ను చింపివేశారు. వాటిని పగలగొట్టారు. స్పీకర్ పోడియం వద్ద ఉన్న మానిటర్‌ను పగలగొట్టారు. వైరును చించివేశారు. వీరి ప్రవర్తన గర్హిస్తూ ఈ మొత్తం వ్యవహరాన్ని గమనించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఎథిక్స్ కమిటీని కోరుతున్నాను. ఇలాంటి సభ్యుల ప్రవర్తను ఖండించకపోతే.. సభ మర్యాదను మనం కాపాడలేంది. కే శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌లను ప్రస్తుత సమావేశాల చివరి రోజు వరకు సస్పెండ్ చేస్తున్నాం’’ అని స్పీకర్ తమ్మినేని సీతారామ్ పేర్కొన్నారు. 

Also Read: అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ.. దమ్ముంటే రా అంటూ అంబటి కౌంటర్.. తొడగొట్టిన బియ్యం మధుసూదన్